Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో ఆయనపై ఆకాశాన్ని తాకే అంచనాలున్నాయి. నెహ్రూ, ఇందిర, రాజీవ్ ల వారసత్వాన్ని రాహుల్ సమర్థవంతంగా కొనసాగిస్తారని, ప్రధానమంత్రి అయి దేశాన్ని కొత్తపథంలో నడుపుతారని అంతా భావించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా 2004లో సోనియా గాంధీ ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చినప్పటికీ… ఆమె ఎక్కువకాలం ఆ పదవిలో కొనసాగరని, రాహుల్ గాంధీకి రాజకీయాల్లో రెండు, మూడేళ్ల అనుభవం రాగానే ఆయనకు పార్టీ పగ్గాలు అప్పజెబుతారని వార్తలొచ్చాయి. యూపీఏ తొలి ఐదేళ్లూ పూర్తిచేసుకునే లోపే మన్మోహన్ సింగ్ ప్రధానిగా తప్పుకుని రాహుల్ పీఎం అవుతారన్నది పదమూడేళ్ల క్రితం రాజకీయ విశ్లేషకులు వేసిన అంచనా. కానీ రాహుల్ పయనం దీనికి విరుద్ధంగా సాగింది.
యూపీఏ హయాంలో ఆయన ఐదేళ్లూ ఎంపీగానే కొనసాగారు. ఆ ఐదేళ్ల కాలంలో యువనేతగా పెద్ద ప్రభావం చూపలేకపోయారు. కాంగ్రెస్ మొత్తం సోనియాగాంధీ చుట్టూనే తిరిగింది. నిజానికి ఆ సమయంలో పార్టీ అధ్యక్ష పగ్గాలు, ప్రధానమంత్రి పదవి రాహుల్ కు ఇస్తే వ్యతిరేకించేవారెవరూ కాంగ్రెస్ లో లేరు. కానీ సోనియాగాంధీ ఎందుకనో రాహుల్ కు క్రియాశీల బాద్యతలు అప్పగించేందుకు ఇష్టపడలేదు. యూపీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత… మరోసారి మన్మోహన్ సింగే ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ సారి మాత్రం మన్మోహన్ పూర్తికాలం పదవిలో ఉండబోరని, రాహుల్ గాంధీకి ఆయన బాధ్యతలు అప్పగిస్తారని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ… రెండోసారి కూడా మన్మోహనే పూర్తికాలం పదవిలో కొనసాగారు. రాహుల్ సామర్థ్యంపై సోనియాగాంధీతో పాటు, కాంగ్రెస్ నేతలకు నమ్మకం లేదని, అందుకే ఆయనకు బాధ్యతలు అప్పజెప్పలేదని ప్రచారం సాగింది.
రాహుల్ ను ప్రతిపక్షాలు పప్పు అంటూ ఎద్దేవా చేయడం మొదలుపెట్టాయి. రాహుల్ ను సామర్థ్యం లేని నేతగా ప్రాంతీయ పార్టీలు సైతం విమర్శించాయి. సోషల్ మీడియాలో రాహుల్ గాంధీపై అనేక జోకులు షేర్ అవడం మొదలయింది. మొత్తంగా… రాహుల్ ప్రధానమంత్రి పదవికి పనికిరాడన్నట్టుగా పరిస్థితులు తయారయ్యాయి. రాహుల్ నాయకత్వలేమిపై, యూపీఏ ప్రభుత్వ అవినీతిపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారన్న విషయం గ్రహించి కాంగ్రెస్ పావులు కదిపింది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి… రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని సోనియా భావించారు. కాంగ్రెస్ 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందంటంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ది కీలకపాత్ర. దేశంలోని ఇతర ప్రాంతాల కన్నా ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువమంది ఎంపీలు గెలిచారు. మరోసారి ఇక్కడ గెలిచే అవకాశంలేదని భావించిన కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ ను విభజించడం ద్వారా ఎన్నికల్లో గెలవాలని వ్యూహం రచించింది. ఆంధ్రప్రదేశ్ విడిపోతే… టీడీపీ ఇక కోలుకోలేదని, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తెలంగాణలో గెలుపొందవచ్చని, రాష్ట్ర విభజనతో టీడీపీ పట్టుకోల్పోతే… ఏపీలోనూ విజయం సాధించవచ్చని.,. తద్వారా రాహుల్ గాంధీని ప్రధానిని చేయవచ్చన్నది కాంగ్రెస్ ఆలోచన. కానీ వాస్తవం దీనికి విరుద్ధంగా జరిగింది.
తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీకన్నా… తెచ్చిన పార్టీకి విశ్వాసం చూపగా… విభజన ద్వారా తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్ పై ఎన్నికల్లో ఆంధ్రప్రజలు కక్ష తీర్చుకున్నారు. దీంతో రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్న సోనియా కల నెరవేరలేదు. 2014 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు… జాతీయస్థాయిలో కాంగ్రెస్ ఘోర ఓటమి పాలయింది. ఈ ఎన్నికల తర్వాత రాహుల్ పై నలుమూలల నుంచి విమర్శల దాడి మొదలయింది. కాంగ్రెస్ పని ఇక అయిపోయిందని, రాహుల్ ఎన్నటికీ ప్రధాని కాలేరని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేశారు. కానీ ఇప్పుడు ఆ అంచనాలు తలకిందులవుతున్నాయి. కొన్నాళ్లుగా రాహుల్ గాంధీ పరిపక్వత చెందిన నేతగా ప్రవర్తిస్తున్నారు. ప్రధాని మోడీ విధానాలపై తరచూ పదునైన విమర్శలు సంధిస్తూ… నాయకత్వ ప్రతిభను కనబరుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన అభ్యర్థిని తానే అని ప్రకటించారు. త్వరలోనే కాంగ్రెస్ అధ్యక్ష బాద్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
గతంలో రాహుల్ ప్రవర్తనకు, ఇప్పటి ప్రవర్తనకూ చాలా తేడా ఉంది. అందుకే కాంగ్రెస్ నేతలకు ఆయనపై నమ్మకం పెరిగిపోతోంది. అటు ప్రత్యర్థిపార్టీలూ ఆయన్ని తక్కువ అంచనా వేయడం లేదు. మోడీకి ఆయన్ను ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. ఇటీవలే శివసేన నేత సంజయ్ రౌత్ రాహుల్ గాంధీ గురించి పాజిటివ్ గా మాట్లాడి కలకలం సృష్టించారు. తాజాగా… కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కూడా రాహుల్ గాంధీ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. రాహుల్ ఇకపై తేలికగా తీసుకుని వదిలేసే నేత కాదని, ఆయన సత్తా పెరిగిపోతోందని అథవాలే వ్యాఖ్యానించారు. ఆయన ఇంక ఎంతమాత్రం పప్పుకాదని, ఇప్పుడాయన చాలా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారని, ఆయనలో మంచి నేత అయ్యే లక్షణాలు పెరుగుతున్నాయని అథవాలే అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ చరిష్మా తగ్గితే… ఆ వెంటనే రాహుల్ గాంధీ మరింతగా పుంజుకుని, బీజేపీని అధికారానికి దూరం చేయగలడని అథవాలే హెచ్చరించారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేత అయిన అథవాలే ఎన్డీఏ ప్రభుత్వంలో సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. మొత్తానికి రాహుల్ తన రాజకీయ జీవితంలో తొలిసారి… బలమైన నేతగా కనిపిస్తూ కాంగ్రెస్ శ్రేణుల్లో అధికారంపై ఆశలు కల్పిస్తున్నారు. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలకు భయం కలిగిస్తున్నారు.