Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాహుల్ గాంధీ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారయింది. మరికొన్ని రోజుల్లో యువరాజు కాంగ్రెస్ అత్యున్నత బాధ్యతలు స్వీకరించనున్నారు. పార్టీలో ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని కొనసాగించాలని లాంఛనప్రాయంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలచేసినప్పటికీ… అధ్యక్షునిగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. సోనియాగాంధీ అధ్యక్షతన సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ యువరాజు పట్టాభిషేకానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. గుజరాత్ ఎన్నికలకు ముందే రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారు.
ఎన్నికల సంఘం నియమావళిని అనుసరిస్తూ రేపు అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్ల దాఖలకు ఈ నెల 24 ను చివరి తేదీగా నిర్ణయించారు. డిసెంబరు 1లోపు నామినేషన్లు ఉపసంహరించుకునే వీలుంది. డిసెంబరు 8న అధ్యక్ష స్థానానికి ఎన్నికలు జరుగుతాయి. డిసెంబరు 11న ఫలితాలు విడుదలవుతాయి. అయితే ఈ ఎన్నికల ప్రక్రియ అంతా కంటితుడుపు వ్యవహారమే. అధ్యక్ష ఎన్నిక కోసం రాహుల్ గాంధీ మినహా మరెవ్వరూ నామినేషన్ దాఖలు చేసే అవకాశమే లేదు. ఇక ఉపసంహరించుకునే గడువుతో కూడా పనిలేదు కాబట్టి నామినేషన్లు దాఖలు చేసే ఆఖరి తేదీనే రాహుల్ గాంధీ అధ్యక్షుడయినట్టు నిర్దారణ అయిపోతుంది. నెహ్రూ గాంధీ కుటుంబం నుంచి ఐదో వ్యక్తి 132 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించి… పార్టీలో కొత్త చరిత్ర ప్రారంభించనున్నారు.