Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏ మనిషి జీవితంలో అయినా ముఖ్య ఘట్టం అనగానే ముందు వరసలో వినిపించే మాట పెళ్లి. అదో వేడుకగా జరుగుతుంది కాబట్టి అలా జ్ఞాపకం ఉంటుంది. కానీ నిజానికి పెళ్ళికి నిశ్చితార్ధానికి మధ్య కాలమే అనుభూతుల రూపంలో పెళ్ళికి మనసులో పెద్ద పీట వేసేలా చేస్తుంది. మన జీవితంలో ఆ కాలానికి వున్న విలువే వేరు. ఈ సమయంలో ఓ ఆడపిల్ల మనసు మరీ గమ్మత్తుగా ఉంటుంది.
మనసు నిండా పెళ్లి ఆలోచనలు. తలపుల్లో కాబోయే మగాడి గుణగణాలు , రూపలావణ్యాలు , జీవితం మీద బంగారు కలలు, ఆశలు… వీటన్నిటీ మధ్య ఎక్కడో చిరు భయం. ఆ ఊహలు , వాస్తవాల మధ్య ఘర్షణతో ఆమె నలిగిపోతుంది. అందుకేనేమో ఆ సమయంలో ఆకలి ఉంటుంది కానీ తినాలి అనిపించదు. నిద్ర వస్తుంది కానీ పడుకోవాలి అనిపించదు. ఏ గొంతు విన్నా అతని రూపమే, ఏ మాట విన్నా అతని ఆలోచనలే. కాస్త ఇబ్బందిగా వున్నా మనసు కి పదేపదే కావాలి అనే అనుభూతులు. ఆ కాలాన్ని కెమెరా తో బంధిస్తే ఎలా ఉంటుంది ? . హౌరా బ్రిడ్జ్ సినిమాలా ఉంటుంది.
సినిమాకి, జీవితానికి లింక్ ఏంటి అనుకుంటున్నారా?. జీవితంలోని ఆ ముఖ్య ఘట్టాన్ని బేస్ చేసుకునే దర్శకుడు యాదు హౌరా బ్రిడ్జ్ స్టోరీ రాసుకున్నారు. ప్రేమ,పెళ్లి, పెళ్లి తరువాత జీవితం బేస్ చేసుకుని ఎన్నో కధలు వచ్చాయి. అయితే నిశ్చితార్ధానికి, పెళ్ళికి మధ్య తీపి గురుతుల్ని ప్రేక్షకుల తలపుల్లోకి తెచ్చేలా రూపొందించిన కథ, కథనమే హౌరా బ్రిడ్జ్. ఇప్పటికే టీజర్ తో కుర్రాకారులో కొత్త ఫుల్ ఇంటరెస్ట్ రేపుతున్న హౌరా బ్రిడ్జ్ సెంట్రల్ పాయింట్ కూడా అంతకుమించి ఆసక్తి కలిగిస్తోంది. మొత్తానికి ఈ సినిమా గురించి సింపుల్ గా చెప్పాలంటే నిశ్చితార్ధం టూ పెళ్లి వయా హౌరా బ్రిడ్జ్ అనొచ్చేమో.