రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మందగమనంలో సాగుతున్నాయని, మరో వారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఉత్తర భారతం వైపు బలమైన రుతుపవనాలు కదలడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర దగ్గరలో బంగాళాఖాతం ప్రాంతంలో సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దాని ప్రభావం తెలంగాణపై ఉండదని పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తనం వల్ల మూడ్రోజుల తర్వాత దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. వచ్చే మూడ్రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతా ల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నదని కరుణాకర్‌రెడ్డి చెప్పా రు. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో బుధవారం చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వాన పడింది. సిరికొండలో 26.5 మి.మీ., రుద్రూర్లో 18.5 మి.మీ., చందూరులో 16.3 మి.మీ., మోస్రాలో 13.8 మి.మీ., వర్నిలో 12.4 మి.మీ., గన్నారం, రెంజల్లో 12.3 మి.మీ. చొప్పున, కమ్మర్‌పల్లిలో 11 మి.మీ., వేల్పూరులో 9.5 మి.మీ. వర్షం కురిసింది. నిజామాబాద్ నగరంలో భారీ వర్షం పడింది.
గ్రేటర్ హైదరాబాద్‌లో ఉక్కపోత
గ్రేటర్ హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. గాలిలో తేమ కూడా తగ్గి ఉక్కపోత పెరిగింది. ఉదయం, సాయంత్రం వేళ మబ్బులు కమ్ముకున్నా.. పగలు ఎండలు దంచికొట్టాయి. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 34.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.3 డిగ్రీలు, గాలిలో తేమ 53 శాతంగా నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శుక్రవారం (ఈ నెల 12న) గ్రేటర్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని చెప్పారు.