Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల తల్లి లక్ష్మీదేవి కన్నుమూశారు. 78 ఏళ్ల లక్ష్మీదేవి కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఈ ఉదయం స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. లక్ష్మీదేవి కుటుంబంలో అందరూ కళాకారులే. భర్త దేవదాస్ కనకాల, కొడుకు రాజీవ్ కనకాల, కుమార్తె శ్రీలక్ష్మి, అల్లుడు పెద్ది రామారావు, కోడలు సుమ అందరూ కళారంగలోనే ఉన్నారు. లక్ష్మీదేవి 11 ఏళ్ల వయసులో నాటకరంగంలో ప్రవేశించారు. నాట్యకారిణి గానూ గుర్తింపుతెచ్చుకున్నారు.
తొలిరోజుల్లో మద్రాస్ ఫిలిం ఇన్ స్టిట్యూట్ లో కళాకారులకు ఉపాధ్యాయురాలిగా ఆమె శిక్షణ ఇచ్చారు. ఆమె దగ్గర శిక్షణ పొందిన నటీనటులు తర్వాతి కాలంలో ఉన్నతస్థానానికి ఎదిగారు. సుహాసిని, శుభలేఖ సుధాకర్ తో పాటు పలువురు లక్ష్మీదేవి వద్ద శిక్షణ పొందారు. లక్ష్మీదేవి కొన్ని చిత్రాల్లో కూడా నటించారు. ప్రేమబంధంలో జయప్రదకు తల్లిగా, పోలీస్ లాకప్ సినిమాలో విజయశాంతికి అత్తగా, కొబ్బరిబోండాం సినిమాలో రాజేంద్రప్రసాద్ తల్లిగా నటించారు. 1971లో లక్ష్మీదేవి నటుడు దేవదాస్ కనకాలను వివాహం చేసుకున్నారు. వారికి కొడుకు రాజీవ్ కనకాల, కూతురు శ్రీలక్ష్మి ఉన్నారు. లక్ష్మీదేవి మృతిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రగాఢసంతాపం తెలియజేసింది.