Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సంచలనం సృష్టించిన స్వాతి కేసులో ఆమె ప్రియుడు రాజేశ్ ను నాగర్ కర్నూల్ పోలీసులు అపోలో ఆస్పత్రిలో అరెస్టు చేశారు. విచారణలో రాజేశ్ స్వాతి భర్త సుధాకర్ రెడ్డి హత్యకు దారితీసిన పరిస్థితులు, స్వాతితో తన అనుబంధం గురించి వెల్లడించాడు. సుధాకర్ రెడ్డిని హత్య చేయాలన్న ప్లాన్ స్వాతిదేనని, ఆమె కోరిక మేరకే తాను ఈ ఘాతుకానికి ఒడిగట్టానని రాజేశ్ అంగీకరించాడు. స్వాతికి తనకు పరిచయం, అనుబంధం ఉన్న మాట వాస్తవమేనన్నాడు. స్వాతి అంటే తనకెంతో ఇష్టమని, అందుకోసమే… మొహం కాల్చుకునే అంత బాధను భరించాలనుకున్నానని రాజేశ్ చెప్పాడు. తన భర్తంటే అసహ్యమని స్వాతి చెప్పేదని, అతను తనకు వద్దని, ఎలాగైనా కలిసుందామని స్వాతి బతిమలాడిందని… ఆమె మాటలు నమ్మి సుధాకర్ రెడ్డి హత్యకు సహకరించానని వెల్లడించాడు.
వ్యక్తిగతంగా తనకు సుధాకర్ తో ఎలాంటి పరిచయం లేదని, ఎలాంటి గొడవలూ లేవని తెలిపాడు. స్వాతిపై అమితవ్యామోహంతోనే ఆమె చెప్పినట్టు చేశాను తప్ప తనకు ఎలాంటి పాపం తెలియదన్నాడు. సుధాకర్ కు తమ విషయం తెలిసిందన్న సంగతి కూడా స్వాతి చెబితేనే తనకు తెలిసిందని, ఆయన తలకు దెబ్బతగిలిందన్న విషయం కూడా స్వాతినే చెప్పిందన్నాడు. తనకు మాంసాహారం తినడం చిన్నప్పటి నుంచి అలవాటు లేదని కూడా చెప్పాడు. ఈ కేసులో సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు తొలిసారి రాజేశ్ పై అనుమానమొచ్చింది… అతను మటన్ సూప్ తాగేందుకు నిరాకరించిన తర్వాతే. అటు విచారణలో రాజేశ్ చెప్పిన విషయాలపై నిజనిర్ధారణ కోసం పోలీసులు కాల్ డేటా రికార్డులు పరిశీలిస్తున్నారు. ఈ సాయంత్రం రాజేశ్ ను తీసుకుని సుధాకర్ రెడ్డి మృతదేహాన్ని దహనం చేసిన ప్రాంతానికి తీసుకెళ్లి సీన్ రీక్రియేట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాజేశ్, స్వాతి విచారణలో వెల్లడించిన వివరాలు పోల్చి ఛార్జ్ షీట్ తయారుచేస్తామని నాగర్ కర్నూల్ పోలీసులు తెలిపారు.