Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విభజన హామీల అమలుపై కేంద్రం నుంచి స్పష్టత వచ్చేవరకు నిరసనను కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఎంపీలకు సూచించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని ధన్యవాదాలు తెలిపే సమయంలోనూ వెనక్కితగ్గొద్దని స్పష్టంచేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ సమస్యలను జాతీయ స్థాయి అజెండాగా మార్చామని, దీనిని హేతుబద్దంగా ముందుకు తీసుకువెళ్లి రాష్ట్ర ప్రయోజనాలు సాధించాలని పిలుపునిచ్చారు. సభ నుంచి సస్పెండ్ చేసినా వెనుకంజవేయకుండా పోరాటం కొసాగించాలని దిశానిర్దేశం చేశారు. విభజనసమయంలో ఆరు నెలలు పార్లమెంట్ లో పోరాటం చేసిన పరిణామాలను గుర్తుచేశారు. తక్కువమంది ఎంపీలతోనే అప్పుడు సభను స్తంభింపచేశామని, ఇప్పుడు ఇంకా ఎక్కువమంది ఎంపీలు ఉన్నారు కాబట్టి ఉధృతంగా పోరాటం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయంపై చర్చించాలని, విభజన సమస్యలపై సభలో రెండు గంటలు ప్రత్యేక చర్చకు పట్టుబట్టాలని కోరారు. ఐదు కోట్లమందికి అన్యాయం జరిగితే ఆ మాత్రం సమయం ఇవ్వలేరా… అని ముఖ్యమంత్రి కేంద్రంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది రెండు ప్రభుత్వాల మధ్య సమస్యని, పార్లమెంట్ లో పోరాడాల్సిన సమస్యను వీధి పోరాటాలుగా మార్చవద్దని, బంద్ వల్ల జనజీవనానికి ఇబ్బందులు తలెత్తుతాయని హితవు పలికారు. మరో రెండు రోజులే సభ జరుగుతుంది కాబట్టి ఒత్తిడి పెంచాల్సిందేనని తేల్చిచెప్పారు. లాలూచీ రాజకీయాల్లో వైసీపీది మొదటి స్థానమని, కేసుల మాఫీ కోసమే వారు కేంద్రంతో లాలూచీ పడాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు సూచనల మేరకు టీడీపీ ఎంపీలు పార్లమెంట్ లో మూడోరోజూ ఆందోళన చేస్తున్నారు. లోక్ సభ ప్రారంభం కాగానే ఎంపీలు ప్లకార్డులు చేతబూని ఏపీకి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. రాజ్యసభలోనూ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మరోమారు చంద్రబాబుకు ఫోన్ చేశారు. విభజన చట్టంలోని అన్ని హామీలపై ప్రధాని సానుకూలంగా ఉన్నారని రాజ్ నాథ్ చంద్రబాబుతో చెప్పారు. ఇవాళ లేదా రేపటిలోగా పరిష్కార మార్గం చూపాలన్నది ప్రధాని అభిమతమని, లోకసభ, రాజ్యసభల్లో టీడీపీ ఎంపీలు సంయమనం పాటించేలా చూడాలని కోరారు. ఈ విషయాన్ని తెలియజేయాలని ప్రధాని స్వయంగా తనను కోరారని రాజనాథ్ వెల్లడించారు.






