రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా పేరు పోస్టర్ అంటా…!

Ram Gopal Varma Release New Movie Poster

ఈ రామ్ గోపాల్ వర్మ ఉన్నచోట ఉండడుగా…”నేను చెప్పిన సినిమాలు ఎప్పుడు తీస్తానో నాకే తెలియదు” అని పోకిరి లెవెల్లో స్టేట్మెంట్లు ఇవ్వడం తప్ప, ప్రకటించిన సినిమాల్లో ముప్పావు వంతు కూడా పట్టాలెక్కించలేదు. అప్పట్లో నితిన్ తో అడవి అనే సినిమా తీసి, క్లైమాక్స్ ని రెండో పార్టు లో చూడండి అని ప్రేక్షకులని దిగ్బ్రాంతిలోకి నెట్టిన ఆర్జివి, ఆ తరువాత ఆ సినిమా సీక్వెల్ ఊసే ఎత్తకపోవడం తో ఆ సినిమా చూసిన జనాలు క్లైమాక్స్ చెప్పరా బాబు అని అప్పుడప్పుడు ఆర్జీవీకి ట్విట్టర్ సందేశాలు పంపిస్తునే ఉన్నారు. ఈ మధ్య బాలకృష్ణ తీస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ కి పోటీగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీస్తున్నానని హడావిడి చేసినా, ఆ సినిమా ఇంకా పట్టాలెక్కనేలేదు. ఇంతటితో ఆర్జీవీ ని పట్టించుకోవడం మానేద్దామనుకున్న తెలుగు సినీ ప్రేక్షకులకి ఆ అవకాశం ఇవ్వకూడదని అనుకున్నాడేమో మళ్ళీ ఇంకో కొత్త సినిమాని ప్రకటించాడు.

rgv

RX100 సినిమాతో ఘనవిజయం సాధించిన అజయ్ భూపతి రామ్ గోపాల్ వర్మ కి ప్రియ శిష్యుడు. తాను వరుస ప్లాపులతో పాతాళానికి పడిపోతున్న, ఏదో ఒక సంచలనం తో ఆకాశానికి ఎగరడం ఆర్జీవీ కి షరామామూలే. అందుకేనేమో అజయ్ భూపతి తో కలిసి ఒక కొత్త సినిమాని నిర్మిస్తున్నాని ప్రకటించాడు నిన్న అర్ధరాతి తన ట్విట్టర్ పేజీలో. ఆ సినిమా పేరు ‘పోస్టర్’ అంటా. మరి ఈ సినిమాకి దర్శకత్వం ఎవరు వహిస్తున్నారో మాత్రం ఆర్జీవీ చెప్పలేదు. ఈ సినిమా ప్రకటన కూడా చాలా గమ్మత్తుగా చేశాడు ఆర్జీవీ. “నిన్న ఎక్కడో ఓపెన్ బార్ లో సేదతీరుతూ, అజయ్ భూపతి అటు తిరిగి ఏదో ఆలోచిస్తుంటే, ఆ అజయ్ భూపతి బ్యాక్ షాట్ ని తన కెమెరా తో క్లిక్ చేసిన ఆర్జీవీ, ఆ షాట్ లో అజయ్ భూపతి ఒక పోస్టర్ బాయ్ లా కనిపిస్తున్నాడని, ఈ సందర్భంగా అజయ్ భూపతి, తాను కలిసి పోస్టర్ అనే సినిమాని నిర్మించబోతున్నామనే విషయాన్నీ ప్రకటిస్తున్నానని” తన ట్విట్టర్ పేజీలో చెప్పుకొచ్చాడు ఆర్జీవీ. మరి ఈ విషయాన్నీ జనం ఎంతవరకు నమ్ముతారో ఏమో తెలీదు కానీ మందు గొంతులో పడిన ప్రతిసారీ ఇలాంటి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం ఆర్జీవీ కి మాత్రమే సాధ్యం.