తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ మాజీ ప్రధాన అర్చకులు మరోసారి ఏపీ ప్రభుత్వం మీద టీటీడీ పాలమండలి మీద విరుచుకుపడ్డారు. తనను ఉద్యోగం నుంచి తప్పించే అధికారం టీటీడీకి ఎవరిచ్చారని ? అలాగే తనకు టీటీడీ నోటీసులు జారీ చేసిందని, కోట్ల మంది కొలిచి, తమ ఇష్టదైవంగా పూజించే కలియుగ దేవదేవుని పరువు విలువ రూ. 100 కోట్లని ఎలా లెక్కగడతారని ఆయన ప్రశ్నించారు. ఈ ఉదయం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, వెలకట్టలేని స్వామికి వెలకట్టిన ఘనత ఈ అధికారులకే దక్కిందని నిప్పులు చెరిగారు. తన మీద పరువు నష్టం దావా వేసే ముందే ఆరాధనలు, అభిషేకాలు, అలంకారాలు, నైవేద్యాలు సరిగ్గా జరుగుతున్నాయని నిరూపించుకోవాలని డిమాండ్ చేసిన రమణ దీక్షితులు, స్వామివారి ఆస్తులను, దివ్యమైన తిరువాభరణాలు భద్రమని నిరూపించుకోవాలని ఆయన సవాల్ చేశారు. అలాగే సుమారు 25 రోజుల పాటు స్వామి వారిని పస్తులు ఉంచారని ఆయన ఆరోపించారు.
తిరుమలలో మలినమైన ప్రసాదాలు పెడుతున్నారని అలాంటి తప్పులను ఎత్తిచూపితే ఉద్యోగం నుంచి తొలగిస్తారా? అని నిలదీశారు. తాను చేసిన ఆరోపణలపై నిస్పక్షపాతమైన విచారణ జరిపాల్సింది పోనిచ్చి తనకు నోటీసులు ఏంటని ప్రశ్నించారు. స్వామివారికి వైఖానస ఆగమ శాస్త్ర పద్ధతుల్లో అన్ని కార్యక్రమాలూ జరుగుతున్నాయని భక్తులకు నమ్మకం కలిగించే చర్యలు ఎక్కడ తీసుకున్నారని ప్రశ్నించారు. 18 లక్షల స్వామి వారి బంగారు మొహర్లను నేల మాళిగలో భద్రపరిచారని, ఈ మాళిగకు వెళ్లాలంటే వంటశాల నుంచే వెళ్లాలని, అయితే డిసెంబర్ లో వంటశాలను మూసివేయడం అనుమానాలకు తావిస్తుందన్నారు దీక్షితులు. మొత్తానికి దీక్షితులు వర్సెస్ టీటీడీ ఇప్పటిలో ఆగేలా కనపడడంలేదు. ఏమి జరగనుందో వేచి చూడాల్సిందే మరి.