Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రంజాన్ మాసంలో ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహిస్తారు. పవిత్ర ఖురాన్ అవతరించిన మాసమైన రంజాన్ నెలలో ప్రతి ముస్లిం ఖురాన్ పఠిస్తాడు. ఈ నెలరోజుల్లో సాధ్యమైనన్ని ఎక్కువసార్లు ఖురాన్ ను సంపూర్ణంగా పఠించాలని, కనీసం ఒక్కసారైనా పూర్తి గ్రంథాన్ని తప్పనిసరిగా చదవాలని, వినాలని మతగురువులు చెబుతారు. ఉపవాసదీక్షలో ఉండే భక్తులు నిత్యం ఆచరించే ఐదు పర్యాయాల ప్రార్థనలతో పాటు మరో ప్రత్యేక ప్రార్థన కూడా చేయాలి. తెల్లవారుజామున ఉపవాస దీక్ష ప్రారంభించే సమయంలో ఫజర్ కి నమాజ్, మధ్యాహ్నం జోహర్ కి నమాజ్, సాయంకాలం అసర్ కి నమాజ్, సాయంత్రం 6 గంటల నుంచి 9.30 గంటల మధ్య మగ్ రీబ్ కి నమాజ్, ఇషా కి నమాజ్ ఆచరిస్తారు.
వీటితో పాటు తరావిహ్ నమాజ్ ఆచరిస్తారు. ఖురాన్ పూర్తిగా కంఠస్థం చేసిన హఫీజ్ లే ఈ ప్రార్థన జరిపిస్తారు. రాత్రి నమాజ్ తర్వాత అదనంగా 20 రకాలుగా నమాజ్ చేస్తారు. చంద్రుడు కనిపించన రాత్రి ప్రారంభించి పండుగకు ఒక్కరోజు ముందు మళ్లీ చంద్రుడు కన్పించిన రోజు ఆపుతారు. రంజాన్ నెలలోని 30 రోజుల్లో ముస్లింలకు అత్యంత ప్రధానమైనది 27వరోజు. దివ్య ఖురాన్ ఈ రోజే ఆవిర్భవించిందన్నది ముస్లింల నమ్మకం. షబ్-ఎ-ఖదర్ గా పిలిచే ఆ రాత్రి ముస్లింలంతా జాగారం చేసి ప్రార్థనలు జరుపుతారు. ఈ రాత్రి కఠోరదీక్షతో ప్రార్థనలు చేస్తే.వెయ్యి నెలలు ప్రార్థనలు చేసిన ప్రతిఫలమొస్తుందన్నది ముస్లింల నమ్మకం.
ఇక రంజాన్ నెలలో ఆఖరి శుక్రవారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. జమాతుల్ విదాగా పిలిచే ఈ శుక్రవారం అందరూ మసీదులకు చేరుకుని జుమా ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆవేదనతో రంజాన్ కు వీడ్కోలు పలుకుతారు. అరబ్బిలో అల్ విదా అంటే వీడ్కోలు అని అర్ధం. జుమా అంటే శుక్రవారం. రంజాన్ రోజు ముస్లింలందరూ కొత్త బట్టలు ధరిస్తారు. ప్రత్యేకంగా షీర్ కుర్మా తయారుచేస్తారు. మసీదుల్లో, ప్రత్యేకంగా నిర్మించిన ఈద్ గాహ్ లలో నమాజ్ చేస్తారు. నమాజ్ పూర్తికాగానే ప్రతి ఒక్కరూ ఇతరులతో భుజాలకు భుజాలు ఆనించి కలవడం ఆనవాయితీ. ఇలా ఉపవాసదీక్షలు, ప్రత్యేక ప్రార్థనలతో రంజాన్ మాసమంతా పవిత్ర భావన నెలకొనిఉంటుంది.