Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నగదు కొరతపై రిజర్వ్ బ్యాంక్ ప్రకటన చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏటీఎంలలో నగదు నిల్వలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. కొన్నిచోట్ల మాత్రమే నగదు కొరత సమస్య ఏర్పడిందని, కేవలం రవాణాలో ఏర్పడిన సమస్య వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఆర్బీఐ వాల్టుల్లో, కరెన్సీ చెస్టుల్లో చాలినంత నగదు ఉందని, నాలుగు కరెన్సీనోట్ల ప్రింటింగ్ ప్రెస్ లు నిర్విరామంగా పనిచేస్తున్నాయని తెలిపింది.
కొన్ని చోట్ల డబ్బు బట్వాడా ఆలస్యమయిన కారణంగానే నగదుకొరత ఏర్పండిందని, ఇది తాత్కాలికమని, ఏటీఎంలలో నగదు నింపే పని జరుగుతోందని వెల్లడించింది. పరిస్థితిని రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని, కరెన్సీ అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి తక్కువగా ఉన్న ప్రాంతాలకు పంపే ఏర్పాట్లు చేశామని రిజర్వ్ బ్యాంక్ వివరించింది. నోట్ల రద్దు సమయంలో ఎదురయిన కరెన్సీ కష్టాలే ఇప్పుడూ ప్రజలు ఎదుర్కొంటున్నారు. బ్యాంకులు, ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు వేలాడుతున్నాయి. నిత్యావసరాలకు డబ్బు దొరక్క ప్రజలు నానా అవస్థలూ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీల్లో నగదు కొరత ఏర్పడింది.