Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏ పండుగకైనా దాని వెనక ఒక సందేశం దాగి ఉంటుంది. పవిత్ర రంజాన్ వెనక కూడా సర్వమానవ సౌభ్రాతృత్వం అనే సందేశం ఉంది. రంజాన్ మాసంలో భక్తితో ఉపవాసం చేసిన వారి అన్ని తప్పులూ తొలగిపోతాయని, రయ్యాన్ అనే ప్రత్యేక ద్వారం గుండా స్వర్గ ప్రవేశం చేస్తారని పవిత్ర ఖురాన్ చెబుతోంది. ఉపవాసదీక్ష చేసేవారు అబద్ధం ఆడకూడదు. పరనిందకు పాల్పడకూడదు. శారీరక, మానసిక వాంఛలకు దూరంగా, నిగ్రహంతో ఉంటూ ఆసాంతం దైవచింతనలో గడపాలి. వయసులో ఉన్న స్త్రీ, పురుషులందరికీ విధిగా నిర్ణయించిన ఉపవాసదీక్ష విషయంలో వృద్ధులు, పిల్లలు, వ్యాధిగ్రస్తులు, ప్రయాణంలో ఉన్నవారికి మినహాయింపు ఉంటుంది. ఉపావాస దీక్ష వల్ల దుర్వ్యసనాల నుంచి విముక్తి, తోటివారిపై జాలి పెరగడం, మనుషులంతా ఒక్కటే అన్న భావన ఏర్పడడం, ఆహారంపై వ్యామోహం తగ్గించడం ద్వారా జీర్ణశక్తిని మెరుగుపరుచుకోవడం వంటి లాభాలు ఉన్నాయి.
రోజాగా పిలుచుకునే ఉపవాసదీక్షల్లో నోటితో పాటు శరీరంలోని ప్రతి అవయవం కట్టడిలో ఉంటుంది. ఉపవాసదీక్షలో ఉన్న ముస్లింలు తన అడుగులు సైతం బురదలో పడకుండా జాగ్రత్తవహించాలి. ఆధ్యాత్మికంగానూ రంజాన్ దీక్షలు ఎంతో ప్రశాంతతను కలిగిస్తాయి. దేవుడి పట్ల విశ్వాసం పెరుగుతుంది. సహనం, క్షమ ఎక్కువవుతాయి. మనసు పవిత్రంగా, ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ప్రార్థించే పెదవులు కన్నా, సాయమందించే చేతులే మిన్న అన్న సూక్తికి రంజాన్ అసలైన ఉదాహరణగా నిలుస్తుంది. మానవతకు రంజాన్ పరిపూర్ణ అర్ధానిస్తుంది. సొంత లాభం కొంత మానుకుని మనిషి పొరుగువాడికి సాయపడాలని, ప్రేమమూర్తిగా మనుగడ సాగించాలన్న జీవిత సత్యం చాటుతుంది. డబ్బులేక ఆహారం కొనుక్కోలేని వారి బాధలను రంజాన్ తొలగిస్తుంది.
ప్రతి ముస్లిం వారి జీవిత సార్థకతకు రంజాన్ మాసాన్ని దేవుడిచ్చిన వరంగా భావిస్తాడు. 30 రోజుల ఉపవాసం తర్వాత రంజాన్ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగను ఈదుల్ ఫితర్ అని కూడా అంటారు. బాల చంద్రుని దర్శించిన తర్వాతి రోజు ఉదయం ముస్లింలంతా భక్తిశ్రద్దలతో పండుగ చేసుకుంటారు. ఈద్గాల్లో పండుగ ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. నమాజ్ అనంతరం ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ శుభాకాంక్షలు తెలుపుకుంటారు.