ఒడిశా, ఉత్తరాంధ్రను వణికిస్తున్న ‘తిత్లీ’ తుపాను పెను విలయం సృష్టిస్తూ ఈరోజు తెల్లవారుఝామున తీరం దాటింది. తుపాను తీరం దాటుతున్న వేళ, గంటకు 150 కిలోమీటర్ల వరకూ గాలులు వీచాయి. వజ్రపుకొత్తూరు మండలంలోని గొల్లపాడు – పల్లెసారధి మధ్య తిత్లీ తీరాన్ని తాకింది. ముఖ్యంగాతుపాను తీవ్రతకు ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, నందిగాం, పలాస, వజ్రపు కొత్తూరు, మెళియాపుట్టి మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుపానులో అంతర్గతంగా గాలుల వేగం 155 నుంచి 187 కిలోమీటర్ల వరకూ ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గాలుల తాకిడికి జిల్లాలో పలుచోట్ల విద్యుత్ సరఫరా ఆగిపోయింది.
ఇది మరింత బలపడి పెను తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో గురువారం సాయంత్రం వరకు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఆర్టీజీఎస్ కేంద్రం తెలిపింది. దీంతో ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో రెడ్ అలెర్ట్ జారీ అయింది. సోంపేటలో బుధవారం రాత్రి నుంచి వర్షం కుండపోతగా కురుస్తోంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ధనుంజయ రెడ్డి జిల్లా వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు విజయనగరంలోని కలెక్టరేట్‌లో కంట్రోల్ రూము ఏర్పాటు చేశారు. ఏదైనా సమస్య ఎదురైతే 08922 236947, టోల్ ఫ్రీ నంబరు 1077కు ఫోన్ చేయాలని అధికారులు ప్రజలను సూచించారు. విశాఖ కలెక్టరేట్‌లో 1800 4250 0002 నంబర్ ను అందుబాటులో ఉంచారు.తీరం దాటే వేళ తిత్లీ, పెనుగాలులు, భారీ వర్షంతో విరుచుకుపడింది. భారీ వృక్షాలు నేలరాలాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగడంతో, పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వాగుల్లోకి భారీగా వరదనీరు రావడంతో, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ముందు జాగ్రత్తగా రహదారులపై ట్రాఫిక్ ను నిలిపివేసిన అధికారులు, పలు రైళ్లను నిలిపివేశారు.
మరికొన్నింటిని దారి మళ్లించారు. సాయంత్రం వరకూ తిత్లీ విధ్వంసం కొనసాగే అవకాశాలు ఉన్నాయని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ఆ తరువాత మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే తిత్లీ, చత్తీస్ గడ్, తూర్పు తెలంగాణ వైపు కదిలే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.తిత్లీ తుఫాను తీరం దాటిన తరువాత, దాని ప్రభావం విశాఖ జిల్లాపైనా పడింది. విశాఖపట్నంలో భారీ వర్షం కురుస్తూ ఉండటం, ఆకాశం దట్టమైన మేఘాలతో నిండిపోవడంతో ఈ ఉదయం విశాఖ నుంచి బయలుదేరాల్సిన విమాన సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్లాల్సిన ఇండిగో సర్వీసు రద్దయింది. దీంతో దాన్ని విశాఖలో అందుకోవాల్సిన ప్రయాణికులు ఎయిర్ పోర్టులో పడిగాపులు పడుతున్నారు. విశాఖ చేరుకోవాల్సిన ఎయిర్ ఇండియా సర్వీసు కూడా రద్దయింది. విమాన సర్వీసులను మధ్యాహ్నం వరకూ రద్దు చేశామని, ఆపై పరిస్థితిని సమీక్షించి సర్వీసులు పునరుద్ధరిస్తామని అధికారులు ప్రకటించారు.