ఒక నెల ముందు ఊహలకు అందని రీతిలో రోజు రోజుకి కొత్త ధర తో పట్టపగ్గాలు లేకుండా పెరిగిపోయి, లీటర్ తొంబై రూపాయల వరకుచేరుకొని, వినియోగదారులను భయబ్రాంతులకు గురిచేసిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలు నిదానంగా పైసా పైసా తగ్గుకుంటూ వస్తున్నాయి. నిన్నటి వరకు హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 81.32 ఉండగా, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో, లీటర్ పెట్రోల్ పైన 21 పైసలు తగ్గి రూ. 81.13 వద్ద ఉండగా, డీజిల్ ధర 19 పైసలు తగ్గి రూ. 77.67 గా హైదరాబాద్ లో నమోదయ్యాయి. విజయవాడ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 80.54 , డీజిల్ ధర రూ. 79.69 లుగా ఉన్నాయి.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 19 పైసలు మాత్రమే తగ్గి రూ. 76.52, లీటర్ డీజిల్ ధర 17 పైసలు తగ్గి రూ. 71.39 గా నమోదు అయ్యాయి. దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబై లో లీటర్ పెట్రోల్ ధర 19 పైసలు తగ్గి రూ. 82.04, లీటర్ డీజిల్ ధర 18 పైసలు తగ్గి రూ. 74.79 లుగా ఉన్నాయి. ఇదిలా ఉండగా, అంతర్జాతీయ మార్కెట్ లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 67.39 డాలర్లుగా, డీజిల్ డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర 57.41 డాలర్లుగా కొనసాగుతున్నాయి. మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలోనే ఆయిల్ ధరలు ఎక్కువనే విషయం తెలిసినా, ఆయిల్ ధరలను జిఎస్టి పరిధిలోకి తేవాలని నిరసనలు ప్రకటించినా, అంతర్జాతీయ స్థాయి లో ఆయిల్ ధరలు తగ్గిన ప్రతిసారి మన దేశంలో ధరలు తగ్గకపోవడానికి గల కారణాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నా, గత నెల నుండి పైసా పైసా తగ్గుకుంటూ వస్తున్న ఈ పెట్రోల్ మరియు డీజిల్ ధరలు రానున్న ఎన్నికల పుణ్యంగా వినియోగదారులు భావిస్తున్నారు. వేచిచూడాలి ఈ ధరలు ఇంకెంతగా తగ్గుతాయో.