Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాస్టింగ్ కౌచ్ వ్యవహారం దేశరాజకీయాలనూ తాకింది. శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన తర్వాత కాస్టింగ్ కౌచ్ పై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో… ప్రముఖ మహిళలెవరు కనిపించినా… మీడియా కాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నిస్తోంది. సినీరంగమే కాదు… ఇతర రంగాలకు చెందిన మహిళా సెలబ్రిటీలను దీనిపై ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినీపరిశ్రమలో మాత్రమే లేదని… అన్ని చోట్లా ఉందని, పార్లమెంట్ దీనికి అతీతమని భావించవద్దని వ్యాఖ్యానించారు. ఇది చేదుగా ఉండే పచ్చినిజమని, పార్లమెంటే కాదని, ఇతరపని ప్రదేశాల్లోనూ కాస్టింగ్ కౌచ్ ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ వ్యవహారంపై దేశమంతా ఒక్కతాటిపైకి వచ్చి పోరాటం చేయాల్సిన తరుణం ఇదేనన్నారు. బాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందిస్తూ రేణుక ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరెడ్డి వ్యవహారంపై మాట్లాడిన సరోజ్ ఖాన్… ప్రతిభ ఉన్న ఏ అమ్మాయీ తనను తాను అమ్ముకోదు కదా… అని వ్యాఖ్యానించారు. కాస్టింగ్ కౌచ్ ను సమర్థిస్తూ మాట్లాడారు. సినీ పరిశ్రమలో ఎవరినీ రేప్ చేసో, వాడుకునో వదిలేయడం లేదని, కాస్టింగ్ కౌచ్ వల్ల కొందరకి జీవనోపాధి లభిస్తోందని అభ్యంతర కర వ్యాఖ్యలుచేశారు. ఆమె మాటలు పెనుదుమారం రేపడంతో తరువాత ఆమె క్షమాపణలు చెప్పారు.