విడుదల తేదీ : మే 10, 2024
తెలుగు బుల్లెట్ రేటింగ్ : 2.75/5
నటీనటులు: సత్యదేవ్, అతిరా రాజ్, లక్ష్మణ్ మీసాల, రఘు కుంచె, నందగోపాల్ తదితరులు
దర్శకుడు: వివి గోపాలకృష్ణ
నిర్మాత: కృష్ణ కొమ్మాలపాటి
సంగీత దర్శకుడు: కాల భైరవ
సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన మూవీ ‘కృష్ణమ్మ’. వి.వి.గోపాలకృష్ణ ఈ మూవీ కు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ సినిమా ని నిర్మించారు. కాగా ఈ మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం ..!
కథ:
భద్ర (సత్యదేవ్), కోటి (లక్ష్మణ్ మీసాల), శివ (కృష్ణతేజ రెడ్డి) ముగ్గురూ ప్రాణ స్నేహితులు. పైగా ఈ ముగ్గురు అనాథలు. ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చేంత అభిమానంగా ఉంటారు. అయితే, భద్ర – కోటి గంజాయి సరఫరా చేస్తుంటారు . అది శివకి నచ్చదు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో శివ మీనా (అతిరా రాజ్)తో ప్రేమలో పడతారు . తమ స్నేహితుడి ప్రేమ కోసం భద్ర – కోటి ఏం చేశారు ?, ఈ క్రమంలో వారి జీవితాల్లో జరిగిన మలుపులు ఏమిటి ?, ఈ మొత్తం వ్యవహారంలో శివ ఎలా చనిపోయాడు?, అతన్ని ఎవరు చంపారు ?, శివ చావుకు భద్ర – కోటి ఎలా బదులు తీర్చుకున్నారు ? అనేది మొత్తం మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్:
కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ ‘కృష్ణమ్మ’ మూవీ లో కొన్ని ఎమోషన్స్ అండ్ ప్లే అలాగే మూవీ లో చూపించిన మెయిన్ థీమ్ ప్రేక్షకుల మనసును కదిలిస్తుంది . కొంతమంది పోలీసుల దురుసు ప్రవర్తన, పై అధికారుల ఒత్తిడితో వాళ్ళు అమాయకులని ఎలా టార్చర్ పెడతారనే అంశాలు కళ్ళకి కట్టినట్లు చూపించారు దర్శకుడు. తప్పుడు కేసు పెట్టి హీరోని అతని ఫ్రెండ్స్ ని పోలీసులు హింసించే సన్నివేశాలు కూడా చాలా ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంటాయి.
సత్యదేవ్ నటన అద్భుతంగా అని అనిపిస్తోంది . మరో కీలక పాత్రలో లక్ష్మణ్ మీసాల కూడా చాలా బాగా నటించాడు. కృష్ణతేజ రెడ్డి కూడా ఆకట్టుకున్నారు . అతిరా రాజ్ పాత్ర మాత్రం ఈ మూవీ కి ప్రత్యేకం. హీరోయిన్ గా ఆమె బాగానే అలరించింది. అలాగే, రఘు కుంచె, నందగోపాల్ తదితరులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. దర్శకుడు వివి గోపాలకృష్ణ పనితీరు కొన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ సీన్స్ లో హైలైట్ గా నిలుస్తుంది .
మైనస్ పాయింట్స్ :
మనసును కదిలించే ఎమోషనల్ సన్నివేశాలతో ఈ కృష్ణమ్మ మూవీ కొన్ని చోట్ల ఆకట్టుకున్నప్పటికీ.. కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం, అదేవిధంగా స్క్రీన్ ప్లే చాలా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలగడం వంటి అంశాలు మూవీ కి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా దర్శకుడు ఫస్ట్ హాఫ్ కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది. నిజానికి ప్రధాన పాత్రల మధ్య ఎమోషన్స్ ను బాగా ఎస్టాబ్లిష్ చేసినా… కొన్ని చోట్ల మెలోడ్రామాలా అనిపిస్తోంది.
అదేవిధంగా ఫస్ట్ హాఫ్ కామెడీ కోసం పెట్టిన అనవసరమైన ఎలిమెంట్స్ కూడా ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు. ప్రధానంగా కొన్ని సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. నేపథ్యం కొత్తగా తీసుకున్నా… కొన్ని సన్నివేశాలు రొటీన్ గానే సాగాయి. మూవీ చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది, ప్రధాన పాత్రలు ఎలాంటి కష్టాల్లో పడతారో అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఇంకా పెంచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు వివి గోపాలకృష్ణ మాత్రం ఆ దిశగా మూవీ ని నడపలేదు.
సాంకేతిక విభాగం :
మంచి కథాంశం తీసుకోవడంలో సక్సెస్ అయిన వివి గోపాలకృష్ణ అంతే స్థాయిలో ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోవడంలో మాత్రం కాస్త వెనుకబడ్డారు. కానీ, ఆయన రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు మాత్రం కొన్ని ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు కాల భైరవ సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ మూవీ కే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది . ఇక దర్శకుడు ఆలోచనను నమ్మి ఇలాంటి వాస్తవిక మూవీ ని నిర్మించినందుకు నిర్మాత కృష్ణ కొమ్మాలపాటిను అభినందించాలి. ఆయన నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.
తీర్పు:
‘కృష్ణమ్మ’అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ రివేంజ్ యాక్షన్ మూవీ లో చెప్పాలనకున్న మెయిన్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే నటీనటుల నటన ఆకట్టుకుంది. కాకపోతే, స్లో నేరేషన్, ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిస్ కావడం, అలాగే పూర్తిస్థాయిలో కమర్షియల్ అంశాలు లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ మూవీ లో ఎమోషనల్ ఎలిమెంట్స్ మాత్రం చాలా బాగానే ఆకట్టుకుంటాయి.