నిను వీడని నీడను నేనే మూవీ రివ్యూ

review of ninu veedani needanu nene

తారాగణం: సందీప్‌కిషన్, అనన్యాసింగ్, మురళీశర్మ, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, ప్రగతి, పూర్ణిమా భాగ్యరాజ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: పీకే వర్మ
సంగీతం: తమన్
సంభాషణలు: కార్తీక్‌రాజు
నిర్మాతలు: సందీప్‌కిషన్, దయా పన్నెం, విజి సుబ్రహ్మణియన్
దర్శకత్వం: కార్తిక్‌రాజు
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రం తరువాత యువ హీరో సందీప్‌కిషన్ సక్సెస్ అనేమాట విని చాలా కాలమవుతోంది. ఐదేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సందీప్‌కిషన్ తెలుగు, తమిళ భాషల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే వున్నాడు కానీ ఫెయిల్ అయిపోతున్నాడు. ఈ దఫా తనకు లాగైనా హిట్ దక్కాలని తొలిసారి థ్రిల్లర్ జోనర్‌ని ఎంచుకున్నాడు. తనే నిర్మాతగా మారి మిత్రులతో కలిసి నినువీడని నీడను నేనే అంటూ థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మించాడు. కొత్త దర్శకుడు కార్తిక్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఆకట్టుకున్న సందీప్ టీజర్, ట్రైలర్‌లతో ప్రేక్షకులకు కొత్త సినిమాని చూపించబోతున్నాననే సంకేతాల్ని అందించాడు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఏర్పడ్డాయి. సందీప్‌కిషన్ సక్సెస్ కోసం ప్రయత్నించిన థ్రిల్లర్ ఆశించిన స్థాయిలోనే వుందా?. టీజర్, టైలర్‌లలో చూపించిందే సినిమాలో వుందా? లేక అంతకు మించిన కథ దాగి వుందా? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
నాలుగు వందల ఏళ్ల క్రితం గ్రీస్‌లోని ఒక గ్రామంలో ఓ చిన్న పిల్లాడికి అద్దంలో ఒక వృద్ధుడి రూపం కనిపించింది. అయితే ఆ ఊరి వాళ్లు భయంలో ఆ పిల్లవాడిని చంపేశారు. చదివిన విషయాన్ని ఇప్పుడు నేరుగా చూస్తున్నాను అంటూ టీజర్‌లో ఈ సినిమా ఎలా వుండబోతోందో.. దీని కథేంటో హీరో సందీప్ కిషన్ చెప్పేసే ప్రయత్నం చేశాడు. టీజర్‌లో చూపించిన విధంగానే సినిమా కథ, కథనాలు సాగాయి. అర్జున్ (సందీప్‌కిషన్), అనన్యాసింగ్(దివ్య) తల్లిదండ్రుల్ని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఈ విషయం నచ్చని తల్లిదండ్రులు వారిని దూరం పెడతారు. ఓ రోజు అర్జున్, దివ్య కారులో ప్రయాణిస్తూ ఓ స్మశానం మీదుగా రాత్రి వెళుతున్న క్రమంలో యాక్సిడెంట్‌కు గురవుతారు. కానీ ఇద్దరికి ఏమీ కాదు. ఆ తరువాత ఇంటికి వెళ్లిన దగ్గరి నుంచి వారికి అద్దంలో మరో రూపం కనిపిస్తూ వుంటుంది. అర్జున్‌కి, దివ్యకు అద్దంలో కనిపించే రూపాలు ఎవరివి?. వాళ్లు వీళ్లకే ఎందుకు కనిపిస్తున్నారు? వాళ్ల వెనకున్న కథేంటి?. అర్జున్, దివ్యలకు ఏమైంది? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల అభినయం: 
వరుస పరాజయాలతో సతమతమవుతున్న సందీప్‌కిషన్ తొలిసారి థ్రిల్లర్ జోనర్‌ని ఎంచుకుని తనే నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాలో సందీప్ కొంత లావుగా కనిపించినా గత చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రంలో చాలా మెచ్యూర్డ్‌గా నటించినట్టు కనిపించింది. ైక్లెమాక్స్ సన్నివేశాల్లో తల్లి పాత్రధారి పూర్ణిమా భాగ్యరాజ్‌తో కలిసి చేసిన సన్నివేశాల్లో కంటతడిపెట్టిస్తాడు. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా సందీప్‌కు మంచి విజయాన్ని అందించే విధంగా వుంది. కథానాయిక అనన్యాసింగ్‌కిది తెలుగులో తొలి సినిమా. బాలీవుడ్‌కు చెందిన అనన్యా సింగ్ నటన పరంగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. కొంత వరకు గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి డబ్బింగ్ చెప్పడం ఆమె పాత్రకు ప్లస్‌గా మారింది. వెన్నెల కిషోర్ కొంత మేరకు ఒకటి రెండు సన్నివేశాల్లో నవ్వించే ప్రయత్నం చేశాడు. పోసాని ఏసీపీగా ఆకట్టుకున్నారు. వెన్నెల కిషోర్ వున్నా నవ్వించే బాధ్యతను కూడా పోసానినే తీసుకున్నారు. ఇక తల్లి పాత్రలో నటించిన సీనియర్ నటి, ఒకప్పటి హీరోయిన్ పూర్ణిమా భాగ్యరాజ్, మురళీశర్మ, ప్రగతి, అతిధి పాత్రల్లో నటించిన మాళవిక నాయర్ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:
తొలి సారి నిర్మాతగా మారినా క్వాలిటీ పరంగా సందీప్ కిషన్ ఎక్కడా రాజీపడలేదు. మంచి క్వాలిటీతో ప్రతీ ఫ్రేమ్ ఆద్యంతం ఆసక్తికరంగా వుండేలా చూసుకున్నాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. పీ.కె. వర్మ ఫొటోగ్రఫీ బాగుంది. హారర్ చిత్రాలకు ప్రధాన బలం నేపథ్య సంగీతం. ఆ స్థాయి సంగీతాన్ని బీజిఎమ్స్‌ని తమన్ అందించి ధియేటర్‌లో సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి కొన్ని సన్నివేశాల్లో భయం పుట్టించాడు. ఈ సినిమాకు తమన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచాయి. సెకండ్ హాఫ్‌లో కొంత స్పీడు పెంచి వుంటే బాగుండేది. ఎడిటర్ కె.ఎల్ ప్రవీణ్ తన కత్తెరకు మరింత పని కల్పిస్తే బాగుండేది.

విశ్లేషణ:
యవ్వనం ఒక ఫాంటసీ అన్నట్టు యుక్త వయసులో వున్నప్పుడు ప్రతీదీ మనం అనుకున్నదే కరెక్ట్. పెద్దలు రాంగ్ అనే బావన వుంటుంది. అలా దుందుడుకుగా వెళితే జీవితం అంతే త్వరగా ముగుస్తుందని, పిల్లల బాగుకోసం తల్లిదండ్రులు చెప్పే మాటల్ని వింటే ఎలాంటి అనర్థాలు జరగవని, అలా కాకుండా మూర్ఖంగా వెళితే అందమైన జీవితాలు అర్థాంతరంగానే ముగిసిపోతాయని ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. దర్శకుడు మంచి పాయింట్‌నే ఎంచుకున్నా దాన్ని అనుకున్న స్థాయిలో ఆవిష్కరించడంలో కొంత తడబాటుకు గురైనట్లుగా కనిపిస్తుంది. అయితే ఆ లోటును ట్విస్ట్‌లు, టర్న్‌లతో ఓవర్ టేక్ చేశాడు. నేటి యువతకు అద్దం పట్టే మంచి థీమ్‌ని ఎంచుకుని ట్విస్ట్‌లు, టర్న్‌లతో నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకు చాలా హారర్ చిత్రాలొచ్చాయి. వాటన్నింటికి పూర్తి భిన్నమైన పాయింట్‌తో సందీప్‌కిషన్ చేసిన ప్రయత్నమిది. ఫస్ట్ హాఫ్‌ని క్యూరియస్‌గా నడిపించి ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ట్విస్ట్ ఇవ్వడం.. సెకండ్ హాఫ్‌పై ప్రేక్షకుడిలో ఆసక్తిని రేకెత్తించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ైక్లెమాక్స్ సన్నివేశాల్లో కన్నీళ్లు తెప్పించాడు. హారర్, సెంటిమెట్‌ని సమపాళ్లలో మేళవించి చేసిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

రేటింగ్: 3.5