గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆర్ఎక్స్ 100’ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి వారంలో ఏకంగా 7 కోట్ల షేర్‌ను రాబట్టిన ఈ చిత్రం రెండవ వారంలో కూడా జోరు కొనసాగిస్తుంది. ఇక ఈ చిత్రం ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. బాహుబలి వంటి బిగ్గెస్ట్ సూపర్ హిట్ చిత్రం రికార్డును క్రాస్ చేసి ఈ చిత్రం నిలవడం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తెలుగు సినిమాల కలెక్షన్స్ గురించి చర్చించేప్పుడు ఎక్కువగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని థియేటర్స్‌లో కలెక్షన్స్ ఎలా ఉన్నాయని అంతా చూస్తూ ఉంటారు. ఈ థియేటర్లలో ఎన్నో రికార్డులు నమోదు అయ్యాయి. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని దేవి థియేటర్లో మొన్నటి వరకు 2882370 రూపాయలతో బాహుబలి మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు ఆర్ఎక్స్100 క్రాస్ చేసింది.
వారం రోజుల్లో దేవి థియేటర్లో 29.3 లక్షలను వసూళ్లు చేసింది. బాహుబలి సమయంతో పోల్చితే ప్రస్తుతం టికెట్ల రేట్లు కాస్త పెరిగాయి. అయినా కూడా ఇదో గొప్ప రికార్డు అంటూ సినీ వర్గాల వారు మరియు ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. వారం రోజుల్లో ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. రంగస్థలం మరియు భరత్ అనే నేను చిత్రాలకు కూడా ఈ ఫీట్ సాధ్యం కాలేదు. కాని ఆర్ఎక్స్ 100 చిత్రం సునాయాసంగా ఆ మార్క్ క్రాస్ చేసింది. మాస్ ఆడియన్స్ ఎక్కువగా ఉండే దేవి థియేటర్లో ఈ చిత్రం వసూళ్లు సాధించిందనడంలో అనుమానం లేదు. ముద్దు సీన్స్‌తో పాటు రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉన్న కారణంగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నట్లుగా దేవిలో అత్యధిక వసూళ్లు నమోదు అయ్యి ఉంటాయని అంటున్నారు.