కార్తికేయ, పాయల్ జంటగా తెరకెక్కిన ‘ఆర్ఎక్స్ 100’ చిత్రం యూత్ ఆడియన్స్‌ను అలరిస్తూ దూసుకు పోతుంది. ఇక ఈ చిత్రంకు పోటీగా విడుదలైన ఏ ఒక్క చిత్రం కూడా పాజిటివ్ రెస్పాన్స్‌ను దక్కించుకోలేక పోవడం వల్ల కూడా ఈ చిత్రానికి కలిసి వచ్చే అంశం. ‘చినబాబు’ చిత్రం పర్వాలేదు అన్నట్లుగా ఉన్నా కూడా డబ్బింగ్ చిత్రం అనే ఉద్దేశ్యంతో ప్రేక్షకులు ఆర్ఎక్స్100 చిత్రం వైపు మొగ్గు చూపుతున్నారు. భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 చిత్ర మరో అర్జున్ రెడ్డి సినిమాల ఉంది అంటూ విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు కాస్త దూరంగా ఉన్నప్పటికి ఈ చిత్రంకు యూత్ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.
సినిమాకు మహారాజ పోషకులు అయిన యూత్ ఆడియన్స్ ఈ చిత్రంను ఆధరిస్తున్న నేపథ్యంలో మొదటి రెండు రోజుల్లోనే ఈ చిత్రం లాభాల బాటలో పడ్డట్లుగా ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. సినిమాకు పోటీ లేక పోవడంతో పాటు రెండవ శనివారం మరియు ఆదివారం ఇలా లాంగ్ వీకెండ్ రావడం వల్ల సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. శని, ఆదివారాల్లో ఇదే జోరు కొనసాగడం ఖాయంగా కనిపిస్తుంది. వచ్చే వారం ఏదో ఒక సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే తప్ప ఈ చిత్రం జోరు తగ్గదు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ చిత్రం 10 కోట్ల షేర్‌ను దక్కించుకోవడం చాలా సులభం అని, అదే నిజం అయితే నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు నక్కతోక తొక్కినట్టే అంటూ సినీ విశ్లేషకులు మరియు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. లాంగ్ రన్లో ఈ చిత్రం రికార్డు వసూళ్లు నమోదు చేయడం ఖాయం అంటూ ప్రేక్షకులు కూడా నమ్మకంగా ఉన్నారు. మరి ఈ చిత్రం ముందు ముందు మరెంతగా ఆశ్చర్యపర్చుతుందో చూడాలి.