RX 100 మూవీ రివ్యూ… తెలుగు బులెట్

RX 100 Movie Review

నటీనటులు : కార్తికేయ గుమ్మడికొండ, పాయల్‌ రాజ్‌పుట్ , రావు రమేష్, రాంకీ తదితరులు
మ్యూజిక్ : చైతన్‌ భరద్వాజ్‌
దర్శకత్వం : అజయ్‌ భూపతి
నిర్మాత : అశోక్‌ రెడ్డి గుమ్మకొండ

రామ్‌ గోపాల్ వర్మ దగ్గర దర్శకత్వశాఖలో అసిస్టెంట్ గా పనిచేసిన అజయ్‌ భూపతి దర్శకుడిగా కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఆర్‌ఎక్స్‌ 100. సినిమా టైటిల్‌ తో పాటు పోస్టర్స్‌, టీజర్స్‌ డిఫరెంట్‌గా ఉండటం, పోస్టర్స్ మీద కాస్త ఘాటు బొమ్మలు ఉండటంతో సినిమా మీద భారీ హైప్‌ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగా చిత్రయూనిట్‌ రొటీన్‌ సినిమాలు చూడాలనుకునేవారు మా సినిమాకు రావొద్దంటూ ధైర్యంగా స్టేట్‌మెంట్‌ ఇవ్వటంతో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. టాలీవుడ్‌లో చిన్న చిత్రాలకు, విభిన్నమైన కథాంశంతో రూపొందే చిత్రాలకు ప్రేక్షకుల విశేష ఆదరణ ఈ మధ్యకాలంలో ఎక్కువగానే లభిస్తోంది.

పెద్ద హీరో, భారీ బడ్జెట్ చిత్రాలనే కాకుండా చిన్న బడ్జెట్ సినిమాలయినా స్టఫ్ ఉన్న సినిమాలని ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు సాక్ష్యంగా పెళ్లిచూపులు, నీదీ నాదీ ఒకే కధ, అర్జున్ రెడ్డి చిత్రాలు సాక్ష్యంగా నిలిచాయి. అర్జున్‌ రెడ్డి లాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమా తరువాత టాలీవుడ్‌లో బోల్డ్ సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నారు. అదే నేపథ్యంలో వచ్చిన చిత్రం RX 100. రిలీజ్‌కు ముందే భారీ అంచనాలను సొంత చేసుకొన్న ఈచిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకొన్నదా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:

చిన్నప్పుడే అమ్మానాన్నలను కోల్పోయిన శివ(కార్తికేయ)ను డాడీ(సింధూరపువ్వు రాంకీ) అన్ని తానే అయి పెంచుతాడు. డాడీకి చేదోడు వాదోడుగా ఉంటూ డాడీ కి చెందిన థియేటర్ భాద్యతలు చూస్తూ సరదాగా కాలం గడిపేస్తుంటాడు. ఊళ్లో రాజకీయాల కారణంగా డాడీకి, గ్రామ జెడ్పీటీసీ విశ్వనాథం(రావు రమేష్)తో గొడవలు అవుతాయి. కానీ అదే సమయంలో శివ, విశ్వనాథం కూతురు ఇందు (పాయల్ రాజ్‌పుత్‌)తో ప్రేమ పడతాడు. తన ప్రేమకు డాడీ సపోర్ట్ ఉంటానని మాట ఇవ్వడంతో శివ, ఇందుకు మరింత దగ్గరవుతాడు. ఒక రోజు మన ప్రేమ విషయం ఇంట్లో చెప్తానని శివకు చెప్పి వెళ్లిన ఇందు, తండ్రి చూసిన ఫారిన్ కుర్రాడిని పెళ్లి చేసుకొని వెళ్లిపోతుంది. ఇందును తన నుంచి దూరం చేశాడని విశ్వనాథం మీద పగ పెంచుకుంటాడు శివ. విశ్వనాథం మనుషులను కొట్టడంతో పాటు, ఆస్తులను కూడా ధ్వంసం చేస్తూ సైకోలా తయారవుతాడు. శివ‌ను కంట్రోల్ చేయ‌డానికి విశ్వనాధం నానా ఇబ్బందులు ప‌డుతుంటాడు. ఇటువంటి సమయంలో ఇందు ఆత్రేయ‌పురంకి వ‌స్తుందా? ఇందు, శివలు కలుస్తారా ? అసలు ఇందు, శివను కాదని మరో పెళ్లి ఎందుకు చేసుకుంది..? వీరి ప్రేమకథలో విలన్‌ ఎవరు..? చివరకు శివ ఏమయ్యాడు అన్నదే మిగతా కథ.

విశ్లేషణ:

ఒక మూసా ధోరణిలో సాగుతున్న తెలుగు సినిమా ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. పెళ్లిచూపులు, నీదీ నాదీ ఒకే కధ, అర్జున్ రెడ్డి చిత్రాలు ఇలా కొన్ని చిత్రాలు తెలుగు సినిమా గమనాన్ని మార్చాయి. ఇప్పటిదాకా హీరో హీరోయిన్ ప్రేమించుకోవడం, దానికి హీరోయిన్ తండ్రి ఒప్పుకోకపోవడం, హీరో అతన్ని ఎదిరించి చివరకు ప్రేయసిని దక్కించుకోవడం. చాలా సినిమాల్లో మీరు చూసిన ప్రేమకథలు ఇవే కదా! కానీ రాం గోపాల్ వర్మ శిష్యుడు తీసిన ఈ ‘RX100’ వాటికి భిన్నం. ఇన్క్రెడిబుల్ లవ్ స్టొరీ అన్న ట్యాగ్ లైన్ కి న్యాయం చేస్తూ పల్లెటూరి వాతావరణంలో స్వచ్ఛమైన ప్రేమను, ప్రేమ కథను తెరపై ఆవిష్కరించారు. అయితే తన ప్రేమ కోసం హీరో పోరాటం చేస్తున్నప్పుడు ఎదురయ్యే హింసను కూడా బాగా చూపించారు. భూపతి తన గురువు రాంగోపాల్ వర్మ పరువు నిలబెట్టాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు హింస విషయంలో, అలాగే హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్‌ను చాలా బోల్డ్‌గా చూపించారు.

ఇంత గాఢమైన రొమాన్స్‌ను సెన్సార్ బోర్డు సభ్యులు ఎలా అంగీకరించారా అనే అనుమానం కలగకమానదు (నిజానికి ఫ్యామిలీలతో సినిమాకి వెళ్ళే వారు కాస్త ఆలోచించాలి). చాలా సౌమ్యంగా ఉండే శివ మొరటోడిలా మారడానికి గల కారణాలను ఫ్యాష్ బ్యాక్‌తో మొదలుపెడుతాడు. ఇందు ఎంట్రీతో తొలిభాగం నాటు రొమాన్స్‌తో వేడెక్కుతుంది. యూత్‌లో జోష్ పెంచే విధంగా లిప్‌లాక్‌లతో సన్నివేశాల్లో కాకపుడుతుంది. ఇలా మొదటి భాగం చూస్తున్నంత సేపు ఇది మామూలు సినిమానే అనిపిస్తుంది. కానీ ప్రీ క్లైమాక్స్‌కు వచ్చేసరికి మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ (నిజానికి ఆ ట్విస్ట్ తెలిస్తే సినిమా చూడాలనే ఆసక్తే పోతుంది. అందుకే దాని గురించి ప్రస్తావించడంలేదు) పెట్టాడు దర్శకుడు. ఫస్టాఫ్ ప్రేక్షకుడికి కాస్త బోర్ కొట్టించినా… సెకండాఫ్ మాత్రం కచ్చితంగా నచ్చుతుంది. ముఖ్యంగా యువతకు మంచి కిక్ ఇచ్చే సినిమా ఇది.

ఈ సినిమా ద్వారా కార్తికేయ హీరోగా పరిచయమయ్యారు. హీరోకి ఉండాల్సిన ఫిజిక్, మేనరిజం కార్తికేయలో ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. శివ పాత్రకు ఆయన కరెక్ట్‌గా సరిపోయారు. నటన కూడా బాగానే ఉంది. తొలి సినిమా కాబట్టి కొన్ని విషయాల్లో, ముఖ్యంగా డైలాగ్ డెలివరీ విషయంలో మెరుగుపడాల్సి ఉంది. ఇక సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ గురించి. హిందీ సీరియల్ నటి అయిన పాయల్‌కు తెలుగులో ఇదే తొలి సినిమా. అయినప్పటికీ అద్భుతంగా నటించింది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్లలో జీవించింది అనుకోండి. హీరోయిన్ తండ్రి పాత్రలో రావు రమేష్ నటన ఎప్పటిలానే చాలా బాగుంది. రాంకీ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. రాంకీ పాత్ర తీర్చిదిద్దిన విధానం బాగుంది. నేప‌థ్య సంగీతం, కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటాయి. పాట‌లూ ఓకే అనిపించాయి. ఒక నిజజీవిత సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు సినిమా ఆఖర్లో తెరపై వేశారు. శివ అనే వ్యక్తి కథ అని ఆయన ఫొటో కూడా చూపించారు. ఈ కథ నిజమా అని తెలుసుకున్న ప్రతి ప్రేక్షకుడు శివ గురించి ఆలోచించక మానడు. అయితే అమ్మాయి పాత్ర‌ని ఇంత నెగిటీవ్ గా చూపించ‌డం, మ‌రీ మితిమీరిన ముద్దులు… ఇవ‌న్నీ కుటుంబ ప్రేక్ష‌కులకు ఈ సినిమాని దూరం చేస్తాయేమో ? కానీ సినిమా యూత్ లో ఉన్న ప్రతి మగాడికీ నచ్చుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

తెలుగు బుల్లెట్ ట్యాగ్ లైన్ : RX 100 ది పాత్ బ్రేకింగ్ స్టోరీ…
తెలుగు బుల్లెట్ రేటింగ్ : 3/5