బీజేపీ ఒప్పుకోకుంటే తెలంగాణ రాదు. కాంగ్రెస్ ఇవ్వకపోయినా తెలంగాణ రాదు. ఆరోజు కాంగ్రెస్ కనీసం ఒకరికి అయినా న్యాయం చేసింది. కానీ మీరు అభయమిచ్చిన ఎపీనే మోసం చేశారని సబ్బంహరి బీజేపీ మీద మండిపడ్డారు. ఒక టీవీ ప్రోగ్రాంలో ఆయన బీజేపీపై, అక్కడున్న జీవీఎల్‌పై నిప్పులు చెరిగారు. ‘‘విభజనలో కాంగ్రెస్ కు, బీజేపీకి సమాన పాపం ఉంది. ప్రత్యక్ష ప్రసారం నిలిపివేసినపుడు బీజేపీ అడ్డుపడలేదు. తలుపులు మూసేసి బిల్లును ప్రవేశ పెడితే ఒక్కమాట మాట్లాడలేదు. ప్రజాస్వామ్యయుతంగా చేస్తామని నిలదీయలేదు. బిల్లు ఆమోదించి బల్లలు చరిచారు. అధికారం అక్కడ వస్తుందని కాంగ్రెస్. భవిష్యత్తులో అయినా బీజేపీ పాలిత రాష్ట్రం అవుతుందని మీరు తెగించారు.
బిల్లు పాస్ చేసుకున్నారు. రాజకీయ క్రీడలో ఏపీ ప్రజలకు బీజేపీ ఘోరమైన అన్యాయం చేస్తోంది. రాజకీయ ఎత్తుగడల కోసం ఏమైనా చేయొచ్చు, గెలవచ్చు. కానీ… ఒకరి మీద పగతో రాష్ట్రానికి అన్యాయం చేయొద్దు. కావాలంటే చంద్రబాబును జైలులో వేసుకుని… రాష్ట్రానికి న్యాయం చేయండి’’. అసలు మీ ఉద్దేశం ఏమిటి? ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడును ఓడించడమా? బీజేపీని గెలిపించడమా? అని సబ్బం హరి జీవీఎల్‌ను నిలదీశారు.
చరిత్ర మొత్తం చూసుకోండి. కాగ్ తప్పు పట్టని ప్రభుత్వం ఉందా? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇన్ని రకాలుగా ఇరకాటం పెట్టారు. అయినా రాష్ట్రానికి ఇన్ని సంస్థలు ఎలా వచ్చాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా అడ్డుకోవడమే బీజేపీ గేమ్‌లా కనిపిస్తోంది అని సబ్బం హరి ఆరోపించారు. ఏపీకి కేంద్రం ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదు. రావాల్సినవే ఇచ్చారు అని సబ్బం హరి స్పష్టం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు ప్రధాని దయాదాక్షిణ్యాల మీద రావన్నారు. ప్రణాళిక సంఘం, ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం వస్తాయని పేర్కొన్నారు. వాద ప్రతివాదాలు కాదని, ప్రజలకు నిజాలు చెప్పాలన్నారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కేసీఆర్‌ను గెలిపించడానికి బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో తేటతెల్లం అవుతోందని సబ్బం హరి అన్నారు.‘‘అధికారంలోకి రావడమే రాజకీయ పార్టీ లక్ష్యం. అందులో ఏం తప్పులేదు. ఏపీలో చంద్రబాబును ఓడిస్తామని ప్రకటించింది. రహస్యాలు ఎందుకు? ఏపీలో గెలవాలనుకున్నప్పుడు బహిరంగంగా చంద్రబాబును ఓడిస్తామని.. తాము పవన్, జగన్‌తో కలిసి ఎన్నికల బరిలో దిగుతామని చెప్పండంటూ జీవీఎల్‌కు సవాల్ విసిరారు. ఎలాగూ తెలంగాణలో కేసీఆర్‌ను గెలిపించేందుకు బీజేపీ బహిరంగంగానే కృషి చేస్తోందిగా అని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన జీవీఎల్ కాస్త తడబడుతూనే సమాధానం ఇచ్చారు.