Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజ్యసభకు నామినేట్ అయిన ఐదేళ్ల తరువాత తొలిసారి ప్రసంగించాలనుకున్న సచిన్ కు నిరాశ ఎదురయిన నేపథ్యంలో ఆయన మరో వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. రైట్ టు ప్లే అండ్ ఫ్యూచర్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ ఇండియా అనే అంశంపై సచిన్ మాట్లాడాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ ఎంపీల ఆందోళన నేపథ్యంలో ఆయన ప్రసంగానికి వీలు కాలేదు. దీంతో తన సందేశాన్ని ప్రజలకు అందించడానికి ఫేస్ బుక్ ఉపయోగించుకున్నారు. రాజ్యసభలో మాట్లాడాలనుకున్న అంశంపై ఫేస్ బుక్ లైవ్ లో ప్రసంగించారు. మనిషి జీవితంలో ఫిట్ నెస్, క్రీడలకు ఉన్న ఆవశ్యకతను వివరించారు. క్రీడలను ప్రేమించే దేశంగా కాకుండా ఆటలను ఆడే దేశంగా భారత్ మారాలని సచిన్ అన్నారు.
క్రీడల వల్ల అనేక ప్రయోజనాలున్నాయని, ఆరోగ్యం, మానసిక స్థైర్యం పెంపొందుతాయని అభిప్రాయపడ్డారు. కలలు నిజం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అవి సాకారం అవుతాయన్నారు. తాను ఆటలు ఆడటాన్ని ఇష్టపడతానన్నారు.తన తండ్రి ఒక కవి, రచయిత అని, తనకు స్వేచ్ఛనిచ్చి లక్ష్యసాధనకు సాయం చేశారని తెలిపారు. అటు గురువారం రాజ్యసభలో సచిన్ ప్రసంగానికి కాంగ్రెస్ ఆటంకం కల్పించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయి.
రాజ్యసభకు సచిన్ ను నామినేట్ చేసి, ఆయనకు భారతరత్న ఇచ్చిన యూపీఏ సభలో ఆయనకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వకపోవడం ఆయన్ను అవమానించడమేనని నెటిజన్లు మండిపడ్డారు. మరికొందరు నెటిజన్లు ఈ అంశంపై అనేక ఛలోక్తులు కూడా పోస్ట్ చేశారు. క్రీడలపై మాట్లాడేందుకు ఇన్నింగ్స్ ప్రారంభించిన సచిన్ కు నిరాశే ఎదురయింది. ప్రతికూల వాతావరణం కారణంగా చైర్మన్ మ్యాచ్ ను రద్దు చేశారు అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా..
పార్లమెంట్ లో కాంగ్రెస్ సచిన్ ను మాట్లాడనివ్వలేదని, దీన్ని బట్టే కాంగ్రెస్ హిందూ దేవుళ్లకు వ్యతిరేకం అని తెలుస్తోందని మరొకరు పోస్ట్ చేశారు. మరొక నెటిజన్ సచిన్ తొలి అంతర్జాతీయ మ్యాచ్ ను, రాజ్యసభ ప్రసంగాన్ని ముడిపెడుతూ కామెంట్ చేశాడు. సచిన్ అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసినప్పుడు డకౌట్ అయ్యాడని, ఇప్పుడు రాజ్యసభలో తొలి ప్రసంగంలోనూ డకౌట్ అయ్యాడని, భవిష్యత్ అతనికే అనుకూలం అని కామెంట్ చేశాడు. టీమిండియా కోచ్ గా గ్రెగ్ చాపల్ ఉన్నప్పుడు సచిన్ ఎలా మాట్లాడలేకపోయాడో…ఇప్పుడు రాజ్యసభలోనూ సచిన్ మాట్లాడలేకపోయాడని మరొక నెటిజన్ ఛలోక్తి విసిరాడు.