సాయిప‌ల్ల‌వి అలాంటి హీరోయిన్ కాదు…

Sai Pallavi Came on Bike to Kanam Movie Pre Release event

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మ‌ల‌యాళ ప్రేమ‌మ్ సినిమాతోనూ, తెలుగులో ఫిదా తోనూ సాయిప‌ల్ల‌వి ఎంత క్రేజ్ తెచ్చుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర‌లేదు. ముఖ్యంగా ఫిదా రిలీజ్ త‌ర్వాత సాయిప‌ల్ల‌వికి తెలుగులో డిమాండ్ పెగిరిపోయింది. వ‌రుస అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. ఆ క్రేజ్ కొన‌సాగుతుండ‌గానే… ఆమెను ప‌లు వివాదాలు చుట్టుముట్టాయి. ఎంసీఏ సినిమా షూటింగ్ లో హీరో నానితో గొడ‌వ‌ప‌డింద‌ని, దిల్ రాజు సినిమా ఆఫ‌ర్ ను తిర‌స్క‌రించింద‌ని, సూర్య హీరోగా న‌టిస్తున్న‌ సినిమ షూటింగ్ కు ఆల‌స్యంగా వ‌స్తోంద‌ని… సెట్లో చాలా పొగ‌రుగా ఉంటుంద‌ని… ఇలా ఆమెపై వ‌రుస ఫిర్యాదులు వినిపించాయి. ఇవి విన్న‌వారికి ఆమె తొలిరోజుల్లోనే కెరీర్ నాశ‌నం చేసుకుంటోంద‌న్న భావ‌న క‌లిగింది. అయితే ఇలాంటి విమ‌ర్శ‌లు అంద‌రిమీదా స‌హజంగా వ‌చ్చేవే అని… కాక‌పోతే సాయిప‌ల్ల‌వి కాస్త ముక్కుసూటి మ‌న‌స్త‌త్వంతో ఉంటుంది కాబ‌ట్టి ఇంకొంచె ఎక్కువ‌గా వినిపిస్తున్నాయ‌ని… ఇవేవీ ఆమె కెరీర్ కు ప్ర‌తిబంధ‌కాలు కావ‌ని ఇండ‌స్డ్రీ వ‌ర్గాలు అంటున్నాయి.

అదే స‌మ‌యంలో నేటి హీరోయిన్ల వైఖ‌రి పూర్తి భిన్నంగా ఉండే సాయిప‌ల్ల‌వి ప్ర‌వ‌ర్త‌న‌నూ వారు ఎంత‌గానో మెచ్చుకుంటున్నారు. రెండు, మూడు సంఘ‌ట‌న‌లను ఉదాహ‌ర‌ణ‌గా చూపుతూ ఆమె స‌క్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఎదుగుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్తంచేస్తున్నారు. మామూలుగా ఒక‌సారి ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టి ఒక‌టి, రెండూ స‌క్సెస్ లు సాధించిన త‌ర్వాత… హీరోయిన్ల వైఖ‌రి మారిపోతుంది. లైఫ్ స్ట‌యిల్ లో చాలా తేడా వ‌స్తుంది. ప్ర‌తి విష‌యంలోనూ స్టార్ హోదాకు త‌గ్గ‌ట్టుగా వ్య‌వ‌హరిస్తుంటారు. కానీ సాయిప‌ల్ల‌వి మాత్రం అలా కాదంటున్నారు. ఆమె సింప్లిసిటీ… హీరోయిన్ల‌లో ఆమెను విభిన్నంగా ఉంచుతుందంటున్నారు. అందుకు క‌ణం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌ను ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తున్నారు. త‌మిళంలో క‌రు పేరుతో రూపొందిన సినిమాను తెలుగులో క‌ణం పేరుతో విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్ లో జ‌రిగింది. ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు సాయిప‌ల్ల‌వి హైద‌రాబాద్ వ‌చ్చింది.

అయితే ఆమె చెన్నై నుంచి బ‌య‌లుదేరిన విమానం హైద‌రాబాద్ కు ఆల‌స్యంగా చేరుకుంది. ఎయిర్ పోర్ట్ నుంచి పార్క్ హ‌య‌త్ హోట‌ల్ కు వ‌చ్చిన సాయిప‌ల్ల‌వి… ప్రీ రిలీజ్ వేడుక‌కు బ‌య‌లుదేరింది. ఆ స‌మ‌యంలో దారిలో ట్రాఫిక్ ఎక్కువ‌గా ఉండ‌డంతో కారు వ‌ద్ద‌ని చెప్పి… ఆమె అసిస్టెంట్ బైక్ పై ప్ర‌సాద్ ల్యాబ్ ద‌గ్గ‌ర‌కు చేరుకుంది. ఆమె అలా బైక్ పై రావ‌డం చూసిన వాళ్లంతా… ఆశ్చ‌ర్య‌పోయారు. ఆమె స‌మ‌య‌స్ఫూర్తిని అభినందించారు. మ‌రో హీరోయిన్ అయితే ఇలా బైక్ పై రావ‌డం అన్న‌ది ఊహించ‌గ‌ల‌మా..ఈ విష‌యంలోనే కాదు… మేక‌ప్ విష‌యంలోనూ సాయిప‌ల్ల‌వి మిగ‌తా హీరోయిన్ల‌తో పోలిస్తే ఇలానే విభిన్నంగా ఉంటుంది. సినిమాల్లోనే కాదు… బ‌య‌ట ఏ కార్య‌క్ర‌మం జరిగినా… హీరోయిన్లు మేక‌ప్ లేకుండా బ‌య‌ట‌కు రారు. అవ‌స‌ర‌మున్నా లేక‌పోయినా… మొహం నిండా మేక‌ప్ ద‌ట్టిస్తుంటారు. కానీ సాయిప‌ల్ల‌వి అలా కాదు… బ‌య‌టే కాదు… సినిమాల్లోనూ మేక‌ప్ లేకుండానే ఆమె న‌టించేయ‌గ‌ల‌దు. ప్రేమ‌మ్ సినిమాలో అలా మేక‌ప్ లేకుండానే క‌నిపించి సాహసం చేసిన సాయిప‌ల్ల‌వి… ధ‌నుష్ హీరోగా తెర‌కెక్క‌బోతున్న సినిమాలో కూడా మ‌రో మారు మేక‌ప్ లేకుండా న‌టించ‌బోతోంది. మొత్తానికి సాయిప‌ల్ల‌వి… ఇలా త‌న సింప్లిసిటీతో ఎప్పటిక‌ప్పుడు తానెంతో భిన్న‌మైన క‌థానాయికో నిరూపించుకుంటోంది.