జడేజాకి క్షమాపణలు చెప్పిన మంజ్రేకర్

sanjay manjrekar said sorry to jadeja

ఐసీసీ వరల్డ్ కప్‌‌లో బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో ఇండియా పోరాడి ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా ఒంటిచెత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ధోనీతో కలిసి 116 పరుగులు పార్టనర్‌షిప్‌తోపాటు కళ్లు చెదిరే షాట్లతో ఇండియా స్కోరును పరుగులు పెట్టించాడు. 59 బంతుల్లో 77 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇంతకుముందు బౌలింగ్‌లో 34 పరుగులిచ్చి ఒక వికెట్ కూడా తీశాడు. ఈ మ్యాచ్‌లో ఇండియా ఓడినా.. గెలుపు కోసం చివరి వరకు పోరాడి అభిమానుల మనసు గెలుచుకుంది. ముఖ్యంగా జడేజా, ధోనీలను అంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరో వైపు మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌ను ఓ ఆట ఆడేసుకుంటున్నారు. 50 పరుగుల తర్వాత జడేజా బ్యాట్‌ను అటూ ఆడిస్తూ పెవిలియన్ వైపు చూసి చేసిన సైగలు మంజ్రేకర్‌ను ఉద్దేశించినవేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంజ్రేకర్ స్పందన ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. మ్యాచ్ తర్వాత మంజ్రేకర్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ‘‘బాగా ఆడావు జడేజా’’ అంటూ కన్ను కొట్టే ఎమోజీతో ట్వీట్ చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో కామెంటర్లతో కలిసి ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్‌ గురించి మాట్లాడుతూ మంజ్రేకర్ జడేజా బ్యాటింగ్ గురించి ప్రస్తావించాడు. ‘‘బిట్స్ అండ్ పీసేస్ అన్నందుకు.. జడేజా ఈ రోజు నన్ను చీల్చి చెండాడు. అన్నివిధాలా నేను తప్పని నిరూపించాడు. మనం ఇప్పటివరకు చూడని రవీంద్ర జడేజా అతడు. గత 40 ఇన్నింగ్స్‌లలో అతడు చేసింది 33 పరుగులే. కానీ, ఈ రోజు చాలా తెలివిగా ఆడాడు. బంతిని చాలా చక్కగా అంచనా వేసి ఆడాడని మంజ్రేకర్ అన్నాడు. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కూడా తెలిపాడు. ఈ వీడియోను ఐసీసీ ట్వీట్ చేసింది. మంజ్రేకర్.. జడేజాను ఎంత పొగిడినా.. సోషల్ మీడియాలో మాత్రం ట్రోల్స్ ఆగడం లేదు. ఇంకా అతడిపై విమర్శలు వస్తూనే ఉన్నాయి.