విజయ్, మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సర్కార్’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ చిత్రంలో మాజీ ముఖ్యమంత్రి జయలలితను అవమానించినట్లుగా అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకురాలిపై ఇలాంటి విమర్శనాత్మక పాత్రను సర్కార్ చిత్రంలో చూపిండంతో అన్నాడీఎంకే నాయకులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమ అధికారంతో మురుగదాస్‌ను అరెస్ట్ చేయించారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సర్కార్ చిత్ర దర్శకుడితో పాటు నిర్మాతను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, వారు వెంటనే సినిమాకు సంబంధించిన ఆ పాత్రను తొలగించాలంటూ పోలీసులు హెచ్చరించారట. దాంతో ప్రస్తుతం ఆ పనిలో ఉన్నారు అంటూ వార్తలు వచ్చాయి.
మురుగదాస్ అరెస్ట్ అయినట్లుగా వచ్చిన వార్తలను పోలీసులు కొట్టి పారేశారు. మురుగదాస్‌పై దాడికి అన్నాడీఎంకే కార్యకర్తలు ప్రయత్నాలు చేయవచ్చు అనే ఉద్దేశ్యంతో తాము మురుగదాస్‌కు భద్రత కల్పించాం. అర్థరాత్రి సమయంలో మురుగదాస్ ఇంటికి వెళ్లి ఆయనకు భద్రత అవసరం అంటూ సూచించాం. అంతే తప్ప వారిని అరెస్ట్ చేయలేదు అంటూ పోలీసులు చెప్పుకొచ్చారు. మీడియాలో వచ్చిన వార్తలను తమిళనాడు పోలీసులు కొట్టి పారేశారు. అన్నాడీఎంకే నాయకులు మాత్రం వెంటనే సర్కార్ సినిమా నుండి అమ్మను కించపర్చే విధంగా ఉన్న సీన్స్‌ను తొలగించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. లేదంటే లీగల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తమిళనాట పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం నెలకొంది.