రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా పదవీబాధ్యతలు చేపట్టిన మొదటి రోజే హరివంశ్‌సింగ్ కేంద్ర ప్రభుత్వానికి ఓ చిన్న సైజ్ ఝలక్ ఇచ్చారు. ఓ ప్రైవేటు తీర్మానంపై ఓటింగ్‌కు అనుమతినిచ్చి కేంద్రాన్ని కార్నర్ చేశారు. అయితే కేంద్రం అదృష్టమో ఏమో గానీ ఆ సమయంలో ఎక్కువ మంది విపక్ష సభ్యులు సభలో లేకపోవడం వల్ల తమ బలాన్ని నిరూపించుకుని ఆ గండం నుంచి ప్రభుత్వం బయటపడింది. అసలు విషయానికి వస్తే ఒక రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలుగా రిజర్వేషన్ ఉన్నవారు మిగిలిన రాష్ట్రాల్లో సైతం ఎస్సీ ఎస్టీలుగా అదే రిజేర్వేషన్ సౌలభ్యం అనుభవించేట్లు రాజ్యాంగాన్ని సవరించాలని విశ్వంభర్ ప్రసాద్ నిషాద్ అనే సమాజ్‌వాదీ సభ్యుడు ఓ ప్రైవేటు బిల్ ప్రవేశపెట్టారు. అయితే ఈ అంశం మీద వెంటనే స్పందించిన సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ ఇది అసాధ్యమని, ఒక కులాన్ని ఎస్సీ లేదా ఎస్టీ లేదా ఓబీసీ అనే కేటగిరీల్లో చేర్చడానికి చాలా ప్రక్రియ జరుగుతుందని ఇలా ఒక చట్టం చేసేయ్యలేమని ఆయన దానిని తిరస్కరించారు. దీంతో ఈ అంశంపై ఓటింగ్ నిర్వహించాలని విపక్షాలు పట్టుబట్టాయి. అయితే ప్రైవేటు తీర్మానంపై చర్చకు అనుమతి ఇవ్వడం అసాధారణమని పేర్కొంటూ విపక్షాల డిమాండ్ మీద న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కానీ కేంద్రానికి కేంద్ర మంత్రులకి షాక్ ఇచ్చే విధంగా డిప్యూటీ స్పీకర్ మాత్రం విపక్షాలకు అనుకూలంగా మాట్లాడారు.
ఒకసారి రూలింగ్ ఇచ్చేశాక వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని, ఓటింగ్ నిర్వహిస్తున్నట్టు చెప్పి ఝలక్ ఇచ్చారు. దాంతో ఆ తీర్మానాన్ని ఓడించడానికి అప్పటికప్పుడు ప్రభుత్వ విప్‌లు తమ పార్టీ సభ్యులను సభలోకి రప్పించడానికి పరుగులు పెట్టారు. ఢిల్లీలోనే ఉంది సభకి రాని వారందరినీ అప్పటికప్పుడు యుద్దప్రాతిపదికన రప్పించి వోటింగ్ చేయించి తీర్మానాన్ని 66-32 ఓట్ల తేడాతో సర్కారు ఓడించగల్గింది. అయితే మెజారిటీ విపక్ష సభ్యులు అందుబాటులో లేకపోవడం వల్లే ప్రభుత్వం బయటపడగలిగింది కానీ లేదంటే తాము ఎంతో కస్టపడి గెలిపించుకున్న వ్యక్తి వల్ల పరువు పోవాల్సిన పరిస్థితి ఏర్పడేది బీజేపీకి.