తమిళనాడులో దిగ్భ్రాంతి కలిగించే దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ భారీ సెక్స్ రాకెట్ ముఠా ఆగడాలను అరికట్టారు పోలీసులు. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకొనే 20 ఏళ్ల లోపు అమ్మాయిలకు ఉచ్చు బిగించి, వారితో లైంగిక సంబంధాలు పెట్టుకొని, వీడియోలు తీసి వ్యాపారం చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా 200 మందికి పైగా అమ్మాయిలను మోసగించినట్లు తెలుస్తోంది. బాధితులంతా కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి పరిసర ప్రాంతాలకు చెందినవారని పోలీసులు చెప్పారు.
ఈ రాకెట్‌ను నడిపించిన ముఠాలోని ఒకరు అధికార పార్టీకి చెందిన ఓ యువనేత కావడం రాజకీయ వర్గాల్లో కూడా కలకలం రేపింది. ఫేస్‌బుక్‌లో అమ్మాయిలతో పరిచయం ఏర్పరచుకోవడం, ఆపై ప్రేమిస్తున్నానంటూ వారి నగ్న దృశ్యాలను వీడియోలు తీసి బెదిరించి అత్యాచారం చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా వీడియోలను కుటుంబీకులకు చూపుతామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. బాధితులు బయటికొచ్చి ఫిర్యాదు చేయకపోవడంతో ఏడేళ్లుగా ఈ రాకెట్ యథేచ్ఛగా సాగినట్లు పోలీసులు తేల్చారు. ఓ విద్యార్థిని ధైర్యంగా ముందుకొచ్చి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పొల్లాచ్చికి చెందిన శబరిరాజన్, తిరునావుక్కరసు, సతీశ్, వసంతకుమార్ అనే కీచకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. వారి వద్ద నుంచి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
అమ్మాయిల అశ్లీల చిత్రాలు, వీడియోలు గుర్తించారు. వాటి ఆధారంగా 200 మందికిపైగానే బాధితులు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నిందితుల వద్ద ఉన్న సెల్ ఫోన్లలో వెయ్యికి పైగా అసభ్యకర వీడియోలు గుర్తించారు పోలీసులు. ఫిర్యాదును వెనక్కి తీసుకోకుంటే సోదరుడిని చంపేస్తామంటూ బాధితురాలిని కొందరు బెదిరించారని ఈ వ్యవహారంలో సెంథిల్, బాబు, నాగరాజ్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశామన్నారు. అయితే నాగరాజ్ అన్నాడీఎంకే పొల్లాచ్చి శాఖ యువ నాయకుడు. అధికార పార్టీ అండ ఉండటంతో ఈ ముఠా చెలరేగిపోయింది. అరెస్టు అయిన ఒకట్రెండు రోజుల్లోనే నాగరాజ్ బెయిల్‌పై బయటకు రావడం కలకలం రేపింది. పొల్లాచ్చి సంఘటనతో సంబంధం ఉన్న నాగరాజ్‌ను పార్టీ నుండి తొలగిస్తున్నట్లు అన్నాడీఎంకే అధిష్ఠానం ప్రకటించింది.