Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మొన్న కథువాలో ఆసిఫా, నిన్న ఉన్నావ్ లో మరో నిర్భాగ్యురాలు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ లో మన గుంటూరులో మరో తొమ్మిదేళ్ళ బాలిక మీద అఘాయిత్యం. మరి రేపు ఈ కీచక పర్వానికి అంతంలేదా ? ఇన్ని ఘటనలు జరుగుతున్నా నిన్న ఆంధ్రప్రదేశ్ లో నిందితుడు దొరికితే చంపేస్తారేమో అన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నా ఈ కీచక పర్వాలు ఆగే పరిస్థితి కనపడటం లేదు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో బుధవారం తొమ్మిదేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేసిన ఘటన మరువకముందే పశ్చిమగోదావరి జిల్లాలో మరో దారుణం వెలుగు చూసింది. తణుకు మండలం తేతలి గ్రామంలో శుక్రవారం ఆరేళ్ళ బాలిక పై పదిహేనేళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలుడికి మరో ముగ్గురు మైనర్‌లు సహకరించారు.
కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. బాధిత బాలిక తేతలి గ్రామంలోని తన అమ్మమ్మ ఇంట్లో ఉంటూ తణుకులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటోంది. వేసవి సెలవులు కావడంతో బాలిక ఇంటి సమీపంలో ఆడుకుంటున్న సమయంలో నలుగురు బాలురు కూడా అక్కడే ఆడుకుంటున్నారు. ఈ పాపని కూడా తమ ఆటలో కలుపుకున్న బాలురు కొద్దిసేపు ఆడుకొన్న తరువాత వారిలో ఒక బాలుడు, ఆ పాపని తన వెంట రమ్మన్నాడు. సమీపంలోని బాత్రూమ్‌లోకి తీసుకెళ్లాడు. వాడి వెంట ఉన్న ముగ్గురు పిల్లలు బయట కాపలా నిలబడ్డారు. బాత్రూమ్‌లోంచి ఆ పాప ఏడ్చుకొంటూ బయటకు పరుగుపెట్టింది. ఇంటికొచ్చిన పాప తీరు ఇంట్లో వాళ్లను భయపెట్టింది. ఆమెకు జరిగింది తెలుసుకొని గుండెలు బాదుకొన్నారు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తణుకు పోలీసులు కేసు నమోదుచేసి.. నలుగురు మైనర్‌లను అదుపులోకి తీసుకొని ఎందుకిలా చేశారని ఆ నలుగురు పిల్లలను అడిగితే ‘‘మేమే చేశాం సార్! సెల్‌ఫోన్‌లో, సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూసి.. మాకు కూడా అలా చేయాలనిపించింది’’ అన్న ఆ బాలల తీరుకు పోలీసులు నివ్వెరపోయారు. ఏమి చేయాలో అర్ధం కాక వారిని జువైనల్ హోం కి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదంతా చూస్తుంటే ఈ చట్టాలు లాంటివి ఏమి చేయలేవేమో అనిపిస్తోంది. చట్టాల్లో కాదు మార్పు మనిషిలో రావాలి..కాదు మనసులో రావాలి..సాటి వారిని మనుషులుగా చూసే మనసుండాలి. చిన్నప్పతి నుండే అమ్మఉగ్గుపాలలో అల్లా పెంచి, మంచి గురువుల బోధనలు ఉంటె ఆ కట్టడికి నిర్భయ చట్టాలు..మరే ఇతర చట్టాలు పనిచేయవు. మాదకద్రవ్యాలు మత్తు పదార్ధాలూ, విశృంఖలంగా అంతర్జాల నీలి చిత్రాలూ,సినిమాలలో ,అశ్లీలత, నగ్న నృత్యాలు, బూతును బూతుకాదంనట్లు అలవోకగా అందుబాటులోకి తెస్తుంటే , ప్రభుత్వమే ఆదాయ వనరులుగా ప్రోత్సహిస్తుంటే పిల్లలు ఇలానే తయారవుతారు. ఈ ఘటన ఒక చెంప పెట్టుగా భావించి ప్రభుత్వం ఇప్పటికయినా కొన్ని కటిన నిర్ణయాలు తీసుకోకుంటే భవిష్యత్తులో ఇంకెన్ని ఘోరాలు చూడాలో.