Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అర్జున్ రెడ్డి సినిమా హీరోయిన్ శాలినీ పాండేకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. హీరో ఓరియెంటడ్ చిత్రమయినప్పటికీ… శాలినీపాండేకూ తగిన గుర్తింపే లభించింది. ముఖ్యంగా సినిమాలో విజయ్ దేవరకొండతో రొమాంటిక్ సన్నివేశాల్లో శాలినీపాండే నటనకు మంచి మార్కులు పడ్డాయి. విజయ్, శాలినీ నిజంగా ప్రేమలో ఉన్నారా అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఈ సన్నివేశాల్లో నటించేటప్పుడు తాను నరకం అనుభవించానని శాలినీ పాండే తాజాగా తమిళ పత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అర్జున్ రెడ్డి షూటింగ్ అప్పుడు తాను పడ్డ బాధ గురించి వివరించింది.
కాలేజీలో చదువుకున్న రోజుల్లో తాను రెండు సార్లు ప్రేమలో విఫలమయ్యానని, ఆ బాధలో ఉండగానే తాను అర్జున్ రెడ్డిలో హీరోతో సన్నిహిత సన్నివేశాల్లో నటించాల్సివచ్చిందని గుర్తుచేసుకుంది. ఆ సమయంలో తనకు ఇబ్బందిగా అనిపిస్తూ, నరకయాతనగా ఉండేదని, అంత బాధలోనే షూటింగ్ పూర్తిచేశానని తెలిపింది. వ్యక్తిగత బాధను పక్కన పెట్టి శాలినీ పాండే అంత చక్కగా నటించడం నిజంగానే ప్రశంసనీయం. సినిమా నటీనటులు షూటింగ్ లు సమయంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారనడానికి శాలినీ పాండే చెప్పిన విషయం ఓ ఉదాహరణ.
గతంలోకూడా చాలా మంది ఈ విషయంలో తమ బాధను వ్యక్తపరిచారు. వ్యక్తిగత జీవితంలోని సంతోషాలకు, బాధలకు, సినిమా షూటింగ్ లకు ఎలాంటి సంబంధం ఉండదని, జీవితంలో బాగా బాధగా ఉన్న సందర్భాల్లో… షూటింగుల్లో విరగబడి నవ్వాల్సివస్తుందని, అలాగే మనం సంతోషంగా ఉన్న సమయంలో షూటింగులో బాగా ఏడవాల్సి వస్తుందని అమితాబ్ బచ్చన్ నుంచి తమన్నా దాకా అనేకమంది ఆవేదన వ్యక్తంచేశారు. షాలినీ పాండే కూడా అలాంటి పరిస్థితే ఎదుర్కొందన్నమాట.