టీమిండియా పేసర్ మహ్మద్ షమీపై భార్య హసీన్ జహాన్ తాజాగా మరికొన్ని సంచలన ఆరోపణలు చేసింది. పాకిస్థాన్ మహిళ నుంచి షమీ డబ్బు పొందాడని, అయితే ఎందుకోసం అతడు డబ్బు తీసుకున్నాడన్న సంగతి తనకు తెలియదని చెప్పింది. తనను మోసం చేసిన అతను దేశాన్నీ మోసం చేయగల ఘనుడని సంచలన వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్ కు చెందిన అలీష్ బా తనకు డబ్బు ఇచ్చిందని షమీనే తనతో చెప్పాడని, అలీష్ బాతో షమీకి సంబంధాలున్నాయనడానికి తన దగ్గర ఆధారాలున్నాయని హసీన్ తెలిపింది. దుబాయ్ లో వారు బసచేసిన హోటల్ కు వెళ్తే..అతడు గది తీసుకున్నాడా లేదా అన్నది తేలిపోతుందని, తాను డబ్బు తీసుకున్నానని షమి చెప్పిన రికార్డింగ్ కూడా తన దగ్గర ఉందని హసీన్ చెప్పింది. తనతో పెళ్లికి ముందు షమీ ప్రేమవ్యవహారం సంగతి కూడా హసీన్ వెల్లడించింది. షమీతో తనకు పరిచయం కావడానికి ముందు..ఐదేళ్లు అతడు తన బంధువులమ్మాయితో సంబంధం కొనసాగించాడని, ఆ అమ్మాయిని పెళ్లిచేసుకుందాం అనుకున్నాడని, కానీ అతని ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకునేందుకు కూడా ప్రయత్నించానడి హసీన్ తెలిపింది.
షమీ కోసం తాను చాలా చేశానని, మోడలింగ్ కెరీర్ ను వదులుకున్నానని, ఉద్యోగాన్ని మానేశానని, ఇళ్లు వదిలి బయటకు కూడా రాలేదని, ఇన్ని చేసినా తనను వదిలించుకోవాలనుకున్నాడని హసీన్ ఆరోపించింది. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తిరిగొచ్చాక ఆస్తి, బీమా పత్రాలు తీసుకుని తనను దూరం పెట్టే ప్రయత్నం చేశాడని, గత రెండేళ్ల నుంచి విడాకులు అడుగుతూనే ఉన్నాడని, కానీ తన ఊపిరి ఉన్నంతవరకు విడాకులు ఇవ్వనని హసీనా తేల్చిచెప్పింది. తన దగ్గర అన్ని ఆధారాలున్నాయని, అతన్ని కోర్టుకు లాగుతానని హెచ్చరించింది. అటు భార్య తనపై చేస్తున్న ఆరోపణలను షమీ మరోసారి ఖండించాడు. ఆమె మానసిక పరిస్థితి సరిగా ఉండకపోవచ్చన్న షమీ…ఆమె వ్యాఖ్యలు చూస్తుంటే ఆమెకు పిచ్చిపట్టినట్టు అనిపిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఫిక్సింగ్ అభియోగాలు దారుణమని, వాటిని నిరూపించాల్సిన అవసరముందని, సరైన విచారణ చేపట్టాలని షమీ అన్నాడు. హసీన్ తో మాట్లాడేందుకు తాను ప్రయత్నిస్తున్నా కుదరడం లేదని, ఆమె చుట్టూ ఉన్న వాళ్లు చేసిన కుట్ర ఇదని, హసీన్ ఇప్పుడే ఈ ఆరోపణలు ఎందుకు చేస్తుందన్నదే అర్థంకావడం లేదని షమీ అన్నాడు.