Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పెద్ద నోట్ల రద్దు… జీఎస్టీ అమలు వంటి నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థను మోడీ ప్రభుత్వం గందరగోళంలో పడేసిందంటూ బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యల ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు యశ్వంత్ వ్యాఖ్యలనే అస్త్రంగా చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అదే సమయంలో మిగిలిన నేతలు, మంత్రులందరూ యశ్వంత్ వ్యాఖ్యలను తప్పుపడుతున్నా…బీజేపీ సీనియర్ నేత, సినీ నటుడు శతృఘ్న సిన్హా మాత్రం ఆయనకు మద్దతుగా నిలిచారు. యశ్వంత్ వ్యాఖ్యలు దేశ ఆర్థికపరిస్థితికి అర్ధం పడుతున్నాయని అభిప్రాయపడ్డ శతృఘ్న సిన్హా మరోమారు ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రస్తావించారు. యశ్వంత్ వ్యాఖ్యలు సరైనవే అని తానే కాకుండా బీజేపీలోని ఎంతో మంది నేతలు భావిస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు. రానున్న రోజుల్లో ప్రజలు దేశ ఆర్థిక సమస్యలను లేవెనెత్తుతారని, మోడీ ప్రభుత్వం వారి అనుమానాలకు సమాధానాలు చెప్పాల్సిఉంటుందని ఆయన హెచ్చరించారు. యశ్వంత్ లేవనెత్తిన విషయాలను మరుగున పరిచేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నించవద్దని కోరారు. ప్రధాని మీడియా ముందుకొచ్చి ప్రజలడిగే ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పాలని సూచించారు.
మోడీ అప్పుడప్పుడైనా…దేశంలోని మధ్యతరగతి ప్రజలు, మధ్యతరగతి వ్యాపారులు, చిన్న వ్యాపారుల గురించి పట్టించుకుంటారని తాను భావిస్తున్నానంటూ…తీవ్రంగా వ్యాఖ్యానించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్రంలోనైనా ఈ మేరకు నడుచుకోవాలని ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నానని శతృఘ్న సిన్హా ట్వీట్ చేశారు. బీజేపీ, ఎన్డీఏ చిరకాలం వర్ధిల్లాలని, జై బీహార్, జై మహారాష్ట్ర, జై గుజరాత్, జైహింద్ అంటూ తన ట్వీట్లను ముగించారు. ఇప్పుడు బీజేపీలో యశ్వంత్ వ్యాఖ్యలతో పాటు శతృఘ్న సిన్హా వ్యవహారశైలి తీవ్ర చర్చనీయాంశమయింది. నిజానికి మనసుల్లో ఏ ఆలోచనలు ఉన్నాయో తెలియదు గానీ…బీజేపీ మంత్రులు కానీ, సీనియర్ నేతలు గానీ ఎప్పుడూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. పెద్ద నోట్ల రద్దు వంటి వివాదస్పద నిర్ణయం సమయంలోనూ బీజేపీ నేతలంతా మోడీకి మద్దతుగా ఒక్కతాటిపైనే నిలిచారు. ఇప్పుడు యశ్వంత్ వ్యాఖ్యలకు కూడా….ఒక్క శతృఘ్న సిన్హా మినహా ఏ ఇతరనేతా బహిరంగంగా మద్దతు తెలపటం లేదు. తనలానే చాలామంది యశ్వంత్ వ్యాఖ్యలు సరైనవనుకుంటున్నారని శతృఘ్న సిన్హా చెప్పే మాటలు నిజమైతే…వారిలో ఒక్కరైనా బయటికొచ్చి…తమ స్పందన తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలా జరగడం లేదంటే….బీజేపీ నేతలెవరూ మోడీకి వ్యతిరేంగా మాట్లాడే సాహసానికి పూనుకోవడం లేదని చెప్పాలి.