Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గుజరాత్ ఎన్నికల్లో పాకిస్థాన్ జోక్యం చేసుకుంటోందని, బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ కు సహాయం చేస్తోందని ప్రధాని మోడీ చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.. ప్రధాని ఆరోపణలపై కాంగ్రెస్ నుంచే కాక ఇతర పక్షాల నుంచి సైతం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మిత్రపక్షంగా ఉంటూ… తరచుగా బీజేపీపై విమర్శలు చేస్తుండే శివసేన..ఈ అంశంలోనూ మోడీ తీరును తూర్పారబట్టింది. దేశరాజకీయాల స్థాయిని మోడీ దిగజార్చారని మండిపడింది. ఈ మేరకు పార్టీ పత్రిక సామ్నాలో ఓ కథనం ప్రచురితమయింది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోడీ వ్యాఖ్యలు బీజేపీ దిగజారుడు రాజకీయాలను సూచిస్తోందని శివసేన ఎద్దేవా చేసింది.
మోడీ తనంతట తానే తన స్థాయిని తగ్గించుకుంటున్నారని అభిప్రాయపడింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మొఘల్ సామ్రాజ్య సమాధులను మోడీ తవ్వారని ఆరోపించింది. ప్రచార సభల్లో మోడీ తీవ్ర భావోద్వేగంతో దూకుడుగా ప్రవర్తిస్తున్నారని, ఆయన గుజరాత్ ఊబిలో చిక్కుకుపోయారని విమర్శించింది. కాంగ్రెస్ బహిష్కృత నేత మణిశంకర్ అయ్యర్ నివాసంలో జరిగిన ఓ విందును ప్రస్తావిస్తూ మోడీ కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. మణిశంకర్ ఇంట్లో పాకిస్థాన్ మాజీ అధికారులు, మాజీ నేతలతో ఓ భేటీ జరిగిందని, దీనికి భారత మాజీ ఉపరాష్ట్రపతితో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా హాజరయినట్టు పత్రికల్లో కథనాలు వచ్చాయని, ఇది అనేక సందేహాలను కలిగిస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు. మోడీ వ్యాఖ్యలపై మన్మోహన్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మణిశంకర్ అయ్యర్ ఇచ్చింది ఓ సాధారణ విందని, ఆ కార్యక్రమంలో అసలు గుజరాత్ ఎన్నికల గురించి ప్రస్తావనే రాలేదని స్పష్టంచేస్తూ ఆయన ఓ లేఖ విడుదల చేశారు. ఈ ఆరోపణలు తనను చాలా బాధించాయని, రాజకీయ లబ్ది కోసం మోడీ ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మన్మోహన్ మండిపడ్డారు.