రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ప్రభుత్వం గ్రీన్ సిగల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఉన్న రెండు మంత్రి పదవులకి చాలా మంది ఆశావహుల పేర్లు వినపడినా చివరికి సీఎం మాత్రం మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు పెద్ద కుమారుడు శ్రవణ్, శాసనమండలి చైర్మన్ ఫరూఖ్ లను మంత్రులుగా ఎన్నుకున్నారు. వీరు ఇరువురూ రేపు నూతన మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు. శాసనమండలి ఛైర్మన్ ఫరూక్, కిడారి శ్రవణ్ లకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపటి క్రితం ప్రకటించారు. సహచర మంత్రులతో పాటు జిల్లా నేతలతో సమన్వయంతో పని చేయాలని ఈ సందర్భంగా ఇద్దరికీ చంద్రబాబు సూచించారు.రాజకీయ ఆరంగేట్రం చేస్తున్న కిడారి శ్రవణ్ కు ఈ సందర్భంగా చంద్రబాబు పలు సూచనలు చేశారు. చిన్నవాడివైనా అవకాశం ఇస్తున్నానని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పార్టీకి మంచి పేరు తీసుకురావాలని శ్రవణ్ కు సూచించారు.
రేపు ఏపీ మంత్రివర్గ విస్తరణ జరగనున్న సందర్బంగా శాసన మండలి ఛైర్మెన్ పదవికి ఫరూక్ రాజీనామా చేశారు. ఆయనకు క్యాబినెట్ లో చోటు ఖాయం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా శాసనసభలో విప్ గా కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా నియమితులైనట్టు సమాచారం. ఉదయం 11.13 గంటలకు ఉండవల్లిలోని గ్రీవెన్స్‌హాల్‌లో నూతన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరుగనుంది. మంత్రి వర్గ విస్తరణ విషయాన్ని ప్రభుత్వం శుక్రవారం రాజ్‌భవన్‌కు సమాచారాన్ని చేరవేసింది. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందుగా అదే రోజు రాష్ట్ర మంత్రి వర్గ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం. ఎపి క్యాబినెట్‌లో గిరిజనులు, ముస్లిం మైనార్టీ వర్గాల నుంచి ఒక్కరు కూడా మంత్రులుగా లేకుండానే చంద్రబాబు పాలన నాలుగున్నరేళ్లు సాగింది. ఎన్నికలకు కేవలం ఆరు నెలల వ్యవధి మాత్రమే ఉండటంతో మైనార్టీ, గిరిజనుల నుంచి వ్యతిరేకత పెరుగుతుందని అంచనా వేసిన చంద్రబాబు మంత్రివర్గ విస్తరణకు పూనుకున్నట్లు తెలుస్తోంది. ముస్లిం మైనార్టీల నుంచి ఎమ్మెల్సీ షరీఫ్ పేరు దాదాపుగా ఖరారవుతుందని అందరూ ఊహిస్తున్నప్పటికీ, శాసనమండలి ఛైర్మన్ ఫరూఖ్‌ను మంత్రి వర్గంలోకి తీసుకోవడం ద్వారా రాయలసీమలో టిడిపి బలోపేతానికి ఉపయోగపడుతుందని చంద్రబాబు ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఎన్డీయేలో భాగస్వామిగా టిడిపి కొనసాగడంతో రాష్ట్ర మంత్రి వర్గంలో కామినేని శ్రీనివాసరావు, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా, పైడికొండల మాణిక్యాలరావు దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగారు. ఎన్డీయే కూటమి నుంచి టిడిపి బయటకు రాగానే బిజెపికి చెందిన ఈ ఇద్దరు మంత్రులు తమ పదవులుకు రాజీనామా చేశారు. దీంతో క్యాబినెట్‌లో మంత్రుల సంఖ్య 26 నుంచి 24కు తగ్గింది.
టిడిపి ప్రభుత్వానికి చివరి మంత్రి వర్గ విస్తరణ కావడంతో అందరి దృష్టి విస్తరణపైనే ఉండేది. ఖాళీగా ఉన్న మంత్రుల శాఖల్లో వైద్య, ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకోగా, దేవాదాయ, ధర్మాదాయశాఖను డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి అదనపు బాధ్యతలుగా నిర్వహిస్తున్నారు. కిడారి శ్రవణ్ శాసనసభలో కానీ, శాసనమండలిలో కానీ సభ్యుడు కాక పోవడంతో ఆరు నెలల లోపు ఆయన ప్రజా ప్రతినిధిగా ఎన్నిక కావాల్సి ఉంది. మావోయిస్టుల చేతిలో మృతి చెందిన కిడారి సర్వేశ్వరరావు రెండవ కుమారునికి ఇప్పటికే గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే చంద్రబాబుకు గిరిజనులు, మైనారిటీల మీద అంత ప్రేమే ఉండుంటే నాలుగున్నరేళ్ళు వారిని మంత్రివర్గంలోకి ఎందుకు తీసుకోలేదని వాదనలు వినిపిస్తున్నాయి. మరో ఆరునెలల్లో చంద్రబాబు ప్రభుత్వానికి కాలపరిమితి ముగుస్తోంది. డిసెంబర్ తర్వాత ఎన్నికల కోడ్ గనుక అమల్లోకి వస్తే వాళ్ళు మంత్రులుగా ప్రోటోకాల్ అనుభవించటం తప్ప చేయటానికి ఏమీ ఉండదు. చివరి ఆరుమాసాల్లో ముస్లిం, గిరిజనులకు మంత్రి పదవులు ఇచ్చినంత మాత్రానా ఓట్లు గుద్దేస్తారా ? అనే అనుమానాలను కొందరు విశ్లేషకులు వ్హ్యక్తం చేస్తున్నారు.