Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఘోరంగా విఫలమయ్యారనే చెప్పొచ్చు. కాంగ్రెస్ సహజశైలికి భిన్నంగా…సిద్ధరామయ్య రాష్ట్రంలో అంతా తానై పార్టీని ఎన్నికల బరిలో నిలిపారు. ఎన్నికల ముందు సిద్ధరామయ్య అత్యంత బలమైన నేతగా కూడా కనిపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధానమంత్రి మోడీ కూడా సిద్ధరామయ్య వ్యూహాల ముందు చిత్తవకతప్పదన్న విశ్లేషణలూ సాగాయి. తీరా ఫలితాలు విడుదలయ్యాక పరిస్థితి రివర్స్ అయింది. సిద్ధరామయ్య కాంగ్రెస్ నే కాదూ…తననూ గెలిపించుకోలేకపోయారు.
ఓడిపోతానన్న భయంతోనే సిద్ధరామయ్య రెండు నియోజకవర్గాల్లో పోటీచేశారన్న ప్రధాని మోడీ విమర్శలు నిజమయ్యాయి. చాముండేశ్వరి నియోజకవర్గంలో సిద్ధరామయ్యకు పరాభవం ఎదురయింది. జేడీఎస్ అభ్యర్థి దేవెగౌడ చేతిలో 25,861 ఓట్ల తేడాతో సిద్ధరామయ్య ఓడిపోయారు. మరో నియోజకవర్గం బాదామీలోనూ ఆయనది చావు తప్పి కన్నలొట్టపోయిన పరిస్థితి. బాదామిలో సిద్ధరామయ్య బొటాబొటీ మెజార్టీతో గట్టెక్కారు. సమీప బీజేపీ ప్రత్యర్థి శ్రీరాములపై 3వేలపైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. మొత్తానికి వన్ మ్యాన్ ఆర్మీగా ఎన్నికల ముందు కనిపించిన సిద్ధరామయ్యే ఇప్పుడు కాంగ్రెస్ ఓటమి భారాన్ని మోయాల్సి ఉంటుంది.