Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రముఖ జర్నలిస్ట్ గౌరీలంకేశ్ హత్యకేసు ప్రధాన నిందితుడు కేటీ నవీన్ కుమార్ ను తదుపరి విచారణ కోసం సిట్ పోలీసులు గోవా, బెళగావికి తీసుకెళ్లనున్నారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉన్నందున, వారి వివరాలు తెలుసుకునేందుకే నవీన్ ను అక్కడకు తీసుకెళ్తున్నామని సిట్ అధికారులు చెప్పారు. హిందూ జనజాగృతికి అనుబంధంగా ఉన్న సనాతన సంస్థతో నవీన్ కు సంబంధాలున్నాయని సిట్ పోలీసులు చెబుతున్నారు. అయితే నవీన్ కుమార్ కుటుంబం మాత్రం పోలీసుల వ్యాఖ్యలపై మండిపడుతోంది.
గౌరీ లంకేశ్ హత్య కేసుకు, నవీన్ కు ఎలాంటి సంబంధం లేదని, అతడు చాలా అమాయకుడని, ఎవరో కావాలనే తనను ఈ కేసులో ఇరికించారని వారు ఆరోపిస్తున్నారు. లంకేశ్ పత్రిక సంపాదకురాలైన గౌరీలంకేశ్ ను గత ఏడాది సెప్టెంబర్ 5న గుర్తుతెలియని దుండగులు ఆమె నివాసం వద్ద కాల్చిచంపారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తు బాధ్యతను కర్నాటక ప్రభుత్వం సిట్ పోలీసులకు అప్పగించింది. కేసులో ప్రధాన నిందితుడయిన నవీన్ కుమార్ ను సిట్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి బెంగళూరు కోర్టులో ప్రవేశపెట్టగా… న్యాయస్థానం అతనికి ఐదురోజుల పాటు రిమాండ్ విధించింది.