వెంకన్న దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తున్న కుటుంబాన్ని కారు డ్రైవర్ నిద్రమత్తు కారణంగా రోడ్డుప్రమాదం చిదిమేసింది. తెల్లవారుతుండగా నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడంతో రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదుట ఈరోజు తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం సబ్బువారిపాలెం గ్రామంలోని రెండు కుటుంబాలకు చెందిన 11మంది ఫార్చునర్ వాహనంలో తిరుమలకు వెళ్లారు. శ్రీవారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న ఫార్చ్యూన్ర్ సోమవారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా, ఆరుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న చిలకలూరి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.డ్రైవర్ నిద్రమత్తులో అతివేగంగా కారు నడపడం వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చీకటి సమయం కావడం, లారీ ఆగివున్నట్లు గమనించకపోవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు చెబుతున్నారు.