Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న క్రికెటర్లపై క్రికెట్ ఆస్ట్రేలియా కఠిన చర్యలు తీసుకుంది. స్మిత్, వార్నర్ పై ఏడాది, బాన్ క్రాఫ్ట్ పై 9 నెలల నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. క్రికెట్ ఆస్ట్రేలియా చర్యలతో ఈ ముగ్గురూ ఐపీఎల్ లో ఆడేది కూడా అనుమానంగా మారింది. కేప్ టౌన్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాన్ క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కాడు. బంతిరివర్స్ స్వింగ్ అయ్యేందుకు బాన్ క్రాఫ్ట్ పసుపురంగు టేపుతో బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించాడు. మైదానంలోని స్క్రీన్ పై ఇందుకు సంబంధించిన దృశ్యాలు చూపించగానే… అప్రమత్తమైన బాన్ క్రాఫ్ట్ టేపును ప్యాంటులో వేసుకుంటూ కనిపించాడు. ఈ దృశ్యం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. జట్టు వ్యూహాల్లో భాగంగానే బాల్ టాంపరింగ్ కు పాల్పడ్డామని కెప్టెన్ స్టీవ్ స్మిత్ అంగీకరించాడు. దీనిపై విచారణ చేపట్టిన క్రికెట్ ఆస్ట్రేలియా దోషులుగా తేలిన ముగ్గురిపై నిషేధం విధించింది.
ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని మాల్కోమ్ టర్న్ బుల్ కూడా ఆగ్రహం వ్యక్తంచేశాడు. టాంపరింగ్ లో కోచ్ డారెన్ లీమన్ పాత్ర కూడా ఉందని అనుమానాలు వచ్చినా… సీఏ చేపట్టిన విచారణలో అదేమీ లేదని తేలింది. మొత్తానికి బాల్ టాంపరింగ్ ముగ్గురు ఆస్ట్రేలియా క్రికెటర్ల కెరీర్ లో చెరగని మచ్చగా మిగిలిపోయింది. ఫామ్ లో ఉన్న సమయంలో ముగ్గురు ఆటగాళ్లపై వేటుపడింది. మైకేల్ క్లార్క్ నుంచి కెప్టెన్సీ చేపట్టిన స్టీవ్ స్మిత్ ఇప్పటిదాకా 34 టెస్టులకు నాయకత్వం వహించాడు. ఇందులో 18 టెస్టుల్లో ఆసిస్ గెలుపొందగా… 10 టెస్టుల్లో ఓడిపోయింది. ఐసీసీ టెస్ట్ బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్ లో స్మిత్ రికార్డు స్థాయిలో 938 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇటీవల ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ప్లేయర్ అవార్డును కూడా స్మిత్ దక్కించుకున్నాడు.