రైతుల ఆదాయాన్ని 2022నాటికి రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ శాఖల బడ్జెట్ రూ. 19,070.36 కోట్లని చెప్పారు. వ్యవసాయ బడ్జెట్ లో రెవెన్యూ వ్యయం రూ. 18,602.98 కోట్లని, పెట్టుబడి వ్యయం రూ. 467.38కోట్లని తెలిపారు. ప్రాథమిక రంగంలో మొదటి అర్ధ సంవత్సరంలో గత ఏడాది 25.6 వృద్ధి సాధించామని, రెండో అర్ధసంవత్సరంలో 25.4శాతం వృద్ధి సాధించామని తెలిపారు. రబీలో 42శాతం వర్షపాతం తక్కువగా నమోదయిందన్నారు. వరి దిగుబడి స్వల్పంగా తగ్గినా… హెక్టారుకు 5176 కిలోల ఉత్పత్తి నమోదు అవుతోందని అన్నారు. రైతులకు రాయితీతో సూక్ష్మపోషకాల పంపిణీ చేస్తున్నామని, దేశంలోనే తొలిసారి భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా 100 శాతం రాయితీతో సూక్ష్మ పోషకాల ఎరువులను రైతులకు పంపిణీచేశామని తెలిపారు.
వరి ఉత్పాదనలో దేశంలో మూడోస్థానంలో, మొక్కజొన్న ఉత్పాదనలో రెండో స్థానంలో ఉన్నామన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతాంగం తరచుగా నష్టపోతోందని, వాటివల్ల నష్టపోయిన 16,38,000 మంది రైతులకు 1904 కోట్ల 63లక్షల రూపాయల పెట్టుబడి రాయితీని వారి ఖాతాల్లో జమచేశామని తెలిపారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని, అధిక ఉత్పాదకతను సాధించేందుకు వ్యవసాయ యాంత్రీకరణపై దృష్టిపెట్టామని మంత్రి చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.4,730కోట్లు కేటాయిస్తున్నామని, కరవు నివారణకు రూ.1,042కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. కౌలు రైతులకు రూ. 2,346 కోట్ల రుణాల పంపిణీ చేస్తున్నామని, రైతు రథం పథకం కింద రూ. 2.50లక్షల రాయితీతో ట్రాక్టర్లు మంజూరుచేస్తున్నామని వెల్లడించారు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ అమలుచేశామని మంత్రి సోమిరెడ్డి తెలిపారు. వ్యవసాయ బడ్జెట్ సందర్భంగా సోమిరెడ్డి పక్కారైతులా పంచె, కండువా ధరించి సభకు వచ్చారు. రైతు వేషధారణతో అసెంబ్లీకి వచ్చిన సోమిరెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇతర మంత్రులు అభినందించారు