Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నేతల మాటలు కోటలు దాటి పోతూంటాయి. అందులోనూ సోము వీర్రాజు, అలాగే ఈమధ్యే వెలుగులోకి వచ్చిన జీవీఎల్ నరసింహారావుల మాటలు మరింత ప్రత్యేకమనే చెప్పాలి. నిన్న రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు మాటలు మీడియా వాళ్ళనే కాక అక్కడున్నవారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. భాజపాలో ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి లాంటి అవినీతి పరులను మార్చే ప్రయత్నం చేస్తామన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా లంచాలిచ్చి మార్చేసిన గాలి జనార్దన్ రెడ్డినే వీర్రాజు గారు మార్చేస్తారట. మరో కొసమెరుపు ఏంటంటే కాంగ్రెస్ నుండి వచ్చిన కన్నా లక్ష్మినారాయణకు ఏపీ భాజపా అధ్యక్ష పదవి ఇవ్వడంపై ఆయన స్పందన నభూతో న భవిష్యత్. భాజపాలోకి వచ్చే కాంగ్రెస్ నేతలందరికీ భాజపా భావజాలం ఎక్కిస్తారట.
కాంగ్రెస్ పార్టీ ఏపీలో నామరూపాల్లేకుండా పోయింది కాబట్టే కన్నా, పురంధేశ్వరి, కావూరి లాంటి నేతలు భాజపాలోకి వచ్చారు. పదవులు ఇస్తే ఉంటారు. కన్నా లక్ష్మినారాయణ చేసిందీ అదే. ఏపీ అధ్యక్ష పదవి దక్కదని తేలిన తర్వాత వైకాపాలోకి దుకాణం సర్దేందుకు సిద్ధమయ్యారు. చివరినిముషాన అమిత్ షా ఫోన్ చేసి పదవి ఇస్తామంటే ఉండిపోయారు. అలాంటి వ్యక్తికి ఈయన భాజపా భావజాలం ఎక్కిస్తారట విడ్డూరంగా. మరో ఆసక్తికర అంశం కూడా ఆయన బయట పెట్టారు అదేంటంటే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవద్దని కూడా చెప్పామన్నారు. కానీ అప్పుడు పవనే కొత్త రాష్ట్రానికి అనుభవం ఉన్న వ్యక్తులు కావాలన్నారని వీర్రాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
వాస్తవానికి వస్తే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది భాజపార్టీ పవన్ కళ్యాణ్ కేవలం తెదేపా-భాజపా కూటమికి మద్దతు ఇచ్చి ప్రచారం చేసాడు అలాంటి ఆయనకి తెదేపాతో పొత్తు వద్దని చెప్పటం ఏమిటో.? తెదేపా-భాజపా పొత్తు చర్చల్లో ప్రత్యక్షంగా పాల్గొంది సోము వీర్రాజు ఇప్పుడేమో పవన్ కల్యాణ్ కు టీడీపీతో పొత్తు వద్దని చేప్పానంటున్నారు సోము వీర్రాజు. అయినా ఎక్కడో పవన్ కళ్యాణ్ కే హితబోధ చేసిన సోము వీర్రాజు మరి తమ సొంత పార్టీ అధిష్టానానికి ఎందుకు చెప్పలేకపోయారో మనలాంటి సామాన్యులకి అస్సలు అర్ధం కాదు. ఇక పోతే పవన్ వాస్తవాలే చెబుతారని, లేకపోతే అతడిని ప్రజలు నమ్మరని 2019 ఎన్నికల గురించి మాట్లాడిన ఆయన జనసేనతో బీజేపీ పొత్తును కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు.