Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించిన తరుణంలో ఆయన సోదరి ప్రియాంక గాంధీ రాజకీయప్రవేశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అధ్యక్ష బాధ్యతలు కుమారుడికి అప్పగించిన తర్వాత విశ్రాంతి తీసుకుంటానని సోనియా గాంధీ వ్యాఖ్యానించడంతో ఆమె స్థానంలో ప్రియాంక గాంధీ కాంగ్రెస్ లోకి వస్తారన్న ప్రచారం జరిగింది. సోనియా నియోజకవర్గం రాయ్ బరేలీ నుంచి ఆమె పోటీచేస్తారని కూడా వార్తలొచ్చాయి. సోదరుడు రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి భర్తతో కలిసి హాజరైన ప్రియాంక తన రాజకీయ ప్రవేశంపై స్పష్టత ఇచ్చారు.
ఓ ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడిన ప్రియాంక వచ్చే ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. రాయ్ బరేలీ నుంచి సోనియాగాంధీనే పోటీచేస్తారని స్పష్టంచేయడం ద్వారా తనపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. 2004లో రాహుల్ గాంధీ రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచి ప్రియాంక అరంగేట్రంపై అనేకసార్లు వార్తలొచ్చాయి. తల్లి, సోదరుడిలా ఆమె కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని కాంగ్రెస్ శ్రేణులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఒక దశలో రాహుల్ ను కాదని ప్రియాంకకే పార్టీ పగ్గాలు అప్పజెప్పాలన్న డిమాండ్ సైతం అంతర్గతంగా వినపడింది.
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత రాహుల్ నాయకత్వంపై అనేక విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రియాంక రాజకీయాల్లోకి వస్తారని అంతా భావించారు. నానాటికీ మసకబారుతున్న కాంగ్రెస్ ప్రతిష్టను తిరిగి నిలబెట్టేందుకు ప్రియాంక లాంటి నాయకురాలు కావాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు సైతం కోరారు. నాయనమ్మ ఇందిరాగాంధీ లక్షణాలు పుణికిపుచ్చుకున్నట్టు ఉండే ప్రియాంక కాంగ్రెస్ కు పూర్వవైభవం తెస్తారన్నది ఆ పార్టీ శ్రేణుల ఆశ. అయితే…ప్రియాంక మాత్రం ఏ కారణం చేతనో రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తిచూపడం లేదు. అటు 2014 ఎన్నికల తర్వాత క్రమక్రమంగా రాహుల్ పార్టీపై పట్టు సాధించడంతో పాటు…బలమైన నేతగా ఎదిగారు. అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో పార్టీ పగ్గాలు స్వీకరించారు.