సినిమా పరిశ్రమపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు మరియు క్యూబ్, యూఎఫ్ఓలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం సౌత్ సినిమా పరిశ్రమ మొత్తంను మార్చి 1వ తేదీ నుండి షట్ డౌన్ చేయబోతున్నట్లుగా నిర్మాత సి కళ్యాణ్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం సినిమాలపై జీఎస్టీ అమలు చేయడం వల్ల చిన్న నిర్మాతలు చాలా నష్టపోతున్నారని, జీఎస్టీ అనేది కార్పోరేట్ నిర్మాతలకు వర్తించేలా చేయాలని సి కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నాడు. పలు సమస్యలు చిన్న సినిమాలను వేదిస్తున్నాయని, అందుకే మార్చి 1 నుండి సౌత్ సినిమా పరిశ్రమ మొత్తంను షట్ డౌన్ చేసి ఉద్యమంను ఉదృతం చేయాలనే యోచనలో ఉన్నట్లుగా నిర్మాత కళ్యాణ్ ప్రకటించాడు.
నైజాం ఏరియాలో ఉన్న ఇద్దరు ముగ్గురు నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్ల కారణంగా సినిమా పరిశ్రమ మొత్తం నాశనం అవుతుందని, చిన్న చిత్రాలను నిర్మించే వారిని వారు తొక్కేస్తున్నారు అంటూ కళ్యాణ్ ఆరోపించాడు. నైజాం మార్కెట్లో పెద్ద సినిమాలు అన్ని కూడా వారే కొంటారు అని, వేరే వారిని కొనకుండా చేస్తున్నారని, వారు తక్కువ రేటుకు కొనడం ద్వారా నిర్మాతలను తీవ్రంగా దెబ్బ తీస్తున్నారు అంటూ సి కళ్యాణ్ ఆరోపించాడు. పరిస్థితి ఇలాగే కొనసాగితే చిన్న చిత్రాల నిర్మాతలు మరింతగా నష్టపోతారు అని, సినిమాల నిర్మాణంను ఇకపై హీరోలే చేసుకోవాల్సి ఉంటుందని ఈ సందర్బంగా సి కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. షట్ డౌన్ అంటే సినిమా పరిశ్రమకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలు జరగవని, మొత్తం సినిమా షూటింగ్లు, విడుదల కార్యక్రమాలు, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇలా అన్ని రకాలుగా మూతబడుతాయి.