ప్రత్యేక ఆర్డినెన్స్ ను జారీ చేయడం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును తొలగించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్వయంగా తెలిపారు. బుధవారం ఉదయం తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకున్న ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. శ్రీవారి ఆభరణాల భద్రత పై ఉన్న అపోహలను నివృత్తి చేయాల్సిన అవసరముందని, త్వరలోనే అధికారులతో ఈ విషయం మీద సమీక్ష జరుపుతున్నామని అన్నారు. గత ప్రభుత్వం నియమించిన పాలక మండలి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయకపోవడంతో, ఆర్డినెన్స్ ద్వారా ప్రస్తుత పాలక మండలిని తొలగించాలని క్యాబినెట్ నిర్ణయించిందని తెలిపారు. టిటిడిలో అభివృద్ధి కి ఆటంకం కలగకుండా త్వరలోనే నూతన పాలక మండలిని ఏర్పాటు చేస్తామని శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలలో వంశ పారంపర్యంగా వస్తున్న అర్చకత్వానికి సంబంధించి సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. బంగారం తరలింపు పై విచారణ జరిపిస్తామన్నారు. ఆరోపణలు నిజమైతే బాధ్యుల పై చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ పేర్కొన్నారు.