Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రెండుసార్లు ప్రపంచక్రికెట్ కప్ విజేత అయిన వెస్టెండీస్. చానాళ్ల నుంచి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. పసికూనల చేతిలో కూడా ఓటమి పాలవుతూ…పేలవమైన జట్టుగా మారిపోయింది. ఇప్పుడు 2019లో జరగబోయే ప్రపంచకప్ లో ఆడేందుకు నేరుగా క్వాలిఫై అయ్యే అవకాశం కోల్పోయింది. ఐదువన్డేల సిరీస్ లో భాగంగా. ఇంగ్లండ్ తో జరిగిన మొదటివన్డేలో ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలయిన వెస్టెండీస్. మ్యాచ్ తో పాటు. ప్రపంచకప్ కు నేరుగా క్వాలిఫై అయ్యే అవకాశాన్ని పోగొట్టుకుంది. అయితే వెస్టెండీస్ ఓటమి శ్రీలంకకు లాభించింది. అదెలాగంటే. ఐసీసీ నిబంధనల ప్రకారం 2019లో ఇంగ్లండ్ లో జరగబోయే ప్రపంచకప్ కు నేరుగా అర్హత సాధించాలంటే టాప్ -8లో ఉండాలి. ఇటీవల భారత్ చేతిలో 5-0తో శ్రీలంక వన్డే సిరీస్ కోల్పోవడంతో ఆ జట్టు ప్రపంచకప్ కు నేరుగా అర్హత సాధించడంపై అనుమానాలు నెలకొన్నాయి. వెస్టెండీస్ ఇంగ్లండ్ వన్డే సిరీస్ ప్రారంభం కావడానికి ముందు శ్రీలంక జట్టు 86 పాయింట్లుతో ఎనిమిదోస్థానంలో ఉంది. విండీస్ 78 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. అయితే ఇంగ్లండ్ తో ఐదు వన్డేల సిరీస్ ను వెస్టెండీస్ 5-0 తేడాతో గానీ, 4-0 తేడాతో గానీ గెలుచుకుంటే.
శ్రీలంకను వెనక్కి నెట్టి పాయింట్ల పట్టికలో పైకి చేరి ప్రపంచకప్ కు నేరుగా అర్హత సాధించేంది. కానీ తాజా ఓటమితో వెస్టెండీస్ అవకాశాలు మూసుకుపోయి శ్రీలంకను అదృష్టం వరించింది. లంక జట్టు ఇప్పుడు నేరుగా ప్రపంచకప్ కు అర్హత సాధించినట్టయింది. వెస్టెండీస్ మాత్రం 2018లో జరిగే క్వాలిఫయ్యర్ మ్యాచ్ లో రాణిస్తేనే…ప్రపంచకప్ బరిలో నిలవగలుగుతుంది. ఇప్పటికే భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా నేరుగా ప్రపంచకప్ కు అర్హత సాధించాయి. చిన్న జట్లు కూడా ఆడుతుండడంతో ఎక్కువమంది ప్రేక్షకులు వీక్షించే ప్రపంచకప్ మ్యాచ్ లు ఆకర్షణ కోల్పోతున్నాయని చాలాఏళ్ల నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఐసీసీ నిబంధనల్లో మార్పులు చేర్పులు చేసింది.