అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలు జాహ్నవి హీరోయిన్ గా తెరకెక్కనున్న సినిమాకు ధడక్ అనే టైటిల్ ఖరారు చేశారు. సినిమా ఫస్ట్ లుక్ ను నిర్మాత కరణ్ జోహార్ ట్వీట్ చేశారు. ధర్మా ప్రొడక్షన్స్, జీ స్టూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శశాంక్ కైతాన్ దర్శకత్వం వహిస్తున్నారు. చిన్న సినిమాగా విడుదలై అద్భుత విజయం సాధించిన మరాఠీ చిత్రం సైరాత్ కు ధడక్ రీమేక్. ఇందులో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖత్తర్ హీరోగా నటిస్తున్నాడు. ఇషాన్, జాహ్నవిలు ఇద్దరికీ ఇదే తొలిచిత్రం. ఫస్ట్ లుక్ లో 20 ఏళ్ల జాహ్నవి పరిణతి చెందిన అమ్మాయిలాగే కనిపిస్తున్నప్పటికీ..ఇషాన్ మాత్రం కాస్త అమాయకంగా కనపడుతున్నాడు.
సినిమాకు అప్పుడే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది జులై 6న ధడక్ ను రిలీజ్ చేయనున్నారు. కొన్నేళ్లగా జాహ్నవి తెరంగేట్రంపై మీడియాలో బాగా చర్చ జరిగింది. ఎప్పటికప్పుడు ఆమె కొత్త సినిమాలు అంగీకరించినట్టు వార్తలొచ్చాయి. జాహ్నవిని బాలీవుడ్ లో సెటిల్ చేయడానికి శ్రీదేవి ఆమెకు కఠిన శిక్షణ ఇప్పించిందని వార్తలొచ్చాయి. తర్వాతి రోజుల్లో అసలు జాహ్నవి హీరోయిన్ కావడమే శ్రీదేవికి ఇష్టం లేదని, 20 ఏళ్లు రాగానే కూతురికి పెళ్లిచేయాలని భావిస్తోందని బీ టౌన్ వర్గాలు చెప్పుకున్నాయి. శ్రీదేవి కూడా తాను అమ్మమ్మను అయినట్టు కల వచ్చిందని ఇంటర్వ్యూల్లో చెప్పడంతో…జాహ్నవి ఇక సినిమాల్లోకి రాదనే అంతా అనుకున్నారు. కానీ చివరకు అమ్మ ఇష్టమో, కూతురి ఆసక్తో తెలియదు కానీ బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకోవడానికి వచ్చేస్తోంది జూనియర్ శ్రీదేవి. అయితే జాహ్నవి సినిమాకు సంబంధించి ముందస్తుగా ఎలాంటి వివరాలూ చెప్పకుండా..ఏకంగా ఫస్ట్ లుక్ విడుదలచేసి అందరినీ సర్ ప్రైజ్ చేసింది చిత్ర యూనిట్.
ఒకప్పుడు బాలీవుడ్ రారాణిగా వెలుగొందిన శ్రీదేవి కూతుర్ని సినిమాల్లోకి పరిచయం చేయడానికి బడా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు చాలా మందికి ఆసక్తి చూపగా…ఆమె మాత్రం శశాంక్ కైతాన్ సినిమాను అంగీకరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అలాగే కూతురు తెరంగేట్రానికి డైరెక్ట్ బాలీవుడ్ కథ కాకుండా…మరాఠీ చిత్రం రీమేక్ కు శ్రీదేవి ఓకే చెప్పడం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రొటీన్ సినిమాల్లా కాకుండా..వైవిధ్య భరిత చిత్రంతో జాహ్నవి కెరీర్ ప్రారంభం కావాలని శ్రీదేవి భావిస్తోంది. భవిష్యత్తులో కూతురు కూడా తల్లికి తగ్గ తనయగా గుర్తింపుతెచ్చుకుంటుందేమో చూడాలి.