Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాష్ట్రమంతా తీవ్ర చర్చనీయాంశమయిన ఆళ్లగడ్డ రాళ్లదాడి పంచాయితీకి ఫుల్ స్టాప్ పడింది. పరస్పరం కత్తులు దూసుకున్న మంత్రి అఖిలప్రియ, ఏవీసుబ్బారెడ్డి మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు సయోధ్య కుదిర్చారు. గత రాత్రి సమావేశం ఫలితాన్నివ్వకపోయినప్పటికీ……ప్రజాదర్బార్ హాల్ లో అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డితో ముఖ్యమంత్రి ఇవాళ జరిపిన భేటీ ఫలప్రదమైంది. ఈ భేటీకి చెల్లెలు మౌనిక, సోదరుడు బ్రహ్మానందరెడ్డి తో కలిసి మంత్రి అఖిల ప్రియ హాజరయ్యారు. ఏవీ సుబ్బారెడ్డి పోటీరాజకీయం చేస్తున్నారని, అలాగే ఆయన కుమార్తె కూడా తనపై విమర్శలు చేశారని చంద్రబాబుకు మంత్రి ఫిర్యాదుచేశారు. అదే సమయంలో ఏవీ సుబ్బారెడ్డి రాళ్లదాడికి సంబంధించిన ఆధారాలను చంద్రబాబు ముందుంచారు. ఈ విషయంలో అఖిలప్రియపై చర్యలు తీసుకోవాలని కోరారు. సీనియర్లను కలుపుకుని ముందుకువెళ్లాలని అఖిలప్రియకు క్లాస్ తీసుకున్న చంద్రబాబు…ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చారు.
పార్టీలో సముచితస్థానం కల్పిస్తామని ఏవీ సుబ్బారెడ్డికి హామీఇచ్చారు. విభేదాలు వీడి కలిసి పనిచేయాలని ఇరువర్గాలకు సీఎం సూచించారు. చంద్రబాబు సూచనను ఇరువర్గాలు అంగీకరించాయి. సయోధ్య తరువాత కర్నూల్ జిల్లా టీడీపీ జిల్లా ఇన్ ఛార్జ్ వర్ల రామయ్య సమక్షంలో మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆదేశాలను తు.చ తప్పకుండా పాటిస్తామని అఖిలప్రియ చెప్పారు. తమ కుటుంబానికి చంద్రబాబే పెద్ద దిక్కన్నారు. ఇకపై ఆళ్లగడ్డలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా చూసుకుంటామని చెప్పారు. పార్టీ అభివృద్ధికి కృషిచేస్తానని,తనకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు విభేదాలు మరిచి పార్టీ శ్రేయస్సుకు, అభివృద్ధికి కృషిచేస్తామని ఏవీ సుబ్బారెడ్డి చెప్పారు.