Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్నాటక సీఎంగా ప్రామాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప భవితవ్యం మరో 24 గంటల్లో తేలబోతోంది. అసెంబ్లీలో మెజార్టీ మార్కు లేకుండానే గవర్నర్ యడ్యూరప్పను సీఎం చేయడంపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటుపై సుప్రీంకోర్టు 24 గంటల్లో శాసనసభలో బల పరీక్ష నిర్వహించాలని, అనంతరం ఈ అంశంపై సుదీర్ఘ విచారణ జరగాలని చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ తరపున వాదిస్తున్న సింఘ్వి రేపు బల పరీక్షకు అంగీకరిస్తున్నట్లు తెలిపారు.
అలాగే ఓటింగ్ సమయంలో వీడియోలు తీయించాలని కోరగా ఈ విషయం మీద డీజీపీని ఆదేశించనున్నట్టు సుప్రీం కోర్టు తెలిపింది. ఇదే సమయంలో కర్ణాటక శాసనసభలో యడ్యూరప్ప ప్రభుత్వం బల పరీక్షకు సమయం కావాలని బీజేపీ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. బల పరీక్షను శనివారం మధ్యాహ్నం 4 గంటలకు నిర్వహించాలని ఆదేశించింది. బల పరీక్షను రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని కోరినట్టు తెలుస్తోంది. అలాగే బల నిరూపణ పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకొవద్దని యడ్యూరప్పని సుప్రీం కోర్టు కోరింది.