Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రపంచ ప్రఖ్యాత కట్టడం, ప్రేమకు చిహ్నం అయిన తాజ్ మహల్ పై అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. తాజ్ మహల్ తమకే చెందుతుందని ఉత్తర్ ప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు వాదించగా… అయితే షాజహాన్ సంతకాలు చూపించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా… భారత పురావస్తు శాఖ 2010లో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వక్ఫ్ బోర్డుకు ఈ ఆదేశాలు జారీచేసింది. మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం ఈ కట్టడాన్ని నిర్మించారు. 2005లో వక్ఫ్ బోర్డు తాజ్ మహల్ ను తమ ఆస్తిగా వెల్లడించింది. దీన్ని వ్యతిరేకిస్తూ పురావస్తు శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వక్ఫ్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తంచేసింది.
తాజ్ మహల్ వక్ఫ్ బోర్డుకు చెందుతుందంటే భారతదేశంలో ఎవరు నమ్ముతారని ప్రశ్నించింది. ఇలాంటి విషయాలతో సుప్రీంకోర్టు సమయాన్ని వృథా చేయకూడదని మండిపడింది. తాజ్ మీదే అయితే షాజహాన్ సంతకం చేసిన ఒరిజినల్ పత్రాలను వారం రోజుల్లోగా సమర్పించాలని ఆదేశించింది. షాజహాన్ జీవితకాలం చివరిలో ఆయన్ను కుమారుడు ఔరంగజేబు ఆగ్రా కోటలో గృహనిర్బంధంలో ఉంచారని, అలాంటప్పుడు మీకు వక్ఫ్ నామాపై సంతకం ఎలా చేశారని న్యాయమూర్తి ప్రశ్నించారు. అసలు ఆ కాలంలో వక్ఫ్ నామానే లేదని పురావస్తు శాఖ తరపు న్యాయవాది తెలిపారు. చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ నుంచి బ్రిటిష్ వాళ్లు స్వాధీనం చేసుకున్న కట్టడాలు, భవనాలను 1948 చట్టం ప్రకారం భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని వెల్లడించారు. ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచిన తాజ్ మహల్ తో పాటు..చారిత్రకకట్టడాలన్నీ భారత పురావస్తు శాఖకే చెందుతాయి. అయితే తాజ్ మహల్ ను ముస్లిం చక్రవర్తులు నిర్మించారన్న ఒకే ఒక్క కారణంతో వక్ఫ్ బోర్డు..ఆ కట్టడం తమకు చెందుతుందని వాదిస్తోంది.
నిజానికసలు తాజ్ మహల్ ఎవరు నిర్మించారన్నదానిపైనే దేశంలో విస్తృతస్థాయిలో చర్చ జరుగుతోంది. అందరూ నమ్ముతున్నట్టుగా తాజ్ మహల్ ను షాజహాన్ నిర్మించలేదని… ఒకప్పుడు అది శివాలయమని, తేజో మహాలయ్ గా దాన్ని పిలిచేవారని… అనంతర కాలంలో మొఘల్ చక్రవర్తులు ఆ ఆలయాన్ని ఆక్రమించుకుని… తాము నిర్మించినట్టుగా చెప్పుకున్నారని ఓ వాదన ఇప్పుడు దేశంలో వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో వక్ఫ్ బోర్డు తాజ్ మహల్ తమ ఆస్తని చెప్పుకోవడం… మరింత వివాదానికి దారితీసే అవకాశముందని భావిస్తుండగా… సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు… ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఉపయోగపడతాయనే అభిప్రాయం వినిపిస్తోంది.