Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనంటూ ఇటీవల తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు ఆధార్ పై నవంబర్ లో విచారణ చేపట్టనుంది. ప్రభుత్వ పథకాలకు ఆధార్ తప్పనిసరిచేస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని నవంబర్ మొదటి వారంలో విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఆధార్ పై విచారణలో భాగంగానే ఇటీవల సుప్రీంకోర్టు వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కా కాదా అన్నదానిపై విచారణ జరిపింది. తొమ్మిది మంది న్యాయమూర్తుల విసృత ధర్మాసనం ఏకగ్రీవంగా వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కే అని తేల్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వ పథకాలు, బ్యాంక్ ఎకౌంట్, పాన్ కార్డ్ వంటి వాటికి ఆధార్ ను అనుసంధానం చేయటంపై సందిగ్ధత నెలకొంది.
ఈ నేపథ్యంలో వ్యక్తిగత గోప్యతపై తీర్పును పరిగణనలోకి తీసుకుని నవంబరులో ఆధార్ పిటీషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయంతో సంక్షేమ పథకాలకు ఆధార్ ను జతచేసే గడువును కేంద్రం పొడిగించింది. డిసెంబరు 31 వరకు ఈ గడువును పొడిగిస్తున్నట్టు అటార్నీ జనరల్ కోర్టుకు తెలిపారు. దైనందిన జీవితంలో ప్రతి అంశాన్ని కేంద్రం ఆధార్ కు ముడిపెట్టడంపై పలువర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసలు ఆధార్ సమాచారానికి భద్రతే లేదని, మన డేటా మొత్తాన్ని అమెరికా తస్కరించిందన్న వార్తల నేపథ్యంలో కేంద్రం నిర్ణయాన్ని మరింత మంది వ్యతిరేకిస్తున్నారు.
అయితే కేంద్రం మాత్రం పట్టువీడటం లేదు. వ్యక్తిగత గోప్యత అన్నది సంపూర్ణమైన స్వేచ్ఛ కాదని, కొన్ని పరిమితులు ఉంటాయని కేంద్రం వాదిస్తోంది. డేటాప్రొటక్షన్ విషయంలో ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని సమాచారం మొత్తం భద్రంగా ఉందని భరోసా ఇస్తోంది. కేంద్రం ఎన్నిరకాలుగా నచ్చజెప్పినా…అన్నింటికీ ఆధార్‌ను తప్పనిసరి చేయడాన్ని మాత్రం ప్రజలు అంగీకరించే స్థితిలో లేరు. దీనిపై మరి సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.