Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రత్యేక హోదా సాధన కోసం చివరి అస్త్రంగా పార్లమెంట్ సమావేశాల చివరిరోజున వైకాపా ఎంపీలు రాజీనా మాలు చేశారు. అవి కూడా తమకు చాలా నుకూలంగా ఉప ఎన్నికలు వచ్చేందుకు అవకాశం లేని తరుణం చూసుకుని మరీ రాజీనామాలు చేసేశారనే విమర్శలు తెలుగుదేశం నేతలు చేస్తూ ఉన్నారు. కేంద్రంలోని భాజపా కూడా వైసీపీ ఎంపీ లకి అనుకూలంగా వ్యవహరించిందనీ, అందుకే రాజీనామాల ఆమోదంపై స్పీకర్ ఇన్నాళ్ల జాప్యం చేశారనే విమర్శలూ ఇప్పుడు వినిపిస్తున్నాయి. తమ రాజీనామాల ఆమోద విషయమై మరోసారి స్పీకర్ సుమిత్రా మహాజన్ ని బుధవారం నాడు వైకాపా ఎంపీలు కలిశారు. అయితే స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ విషయంపై ఎటూ తేల్చకుండా ‘సస్పెన్స్’ కొనసాగిస్తున్నారు. ‘మా రాజీనామాలు ఆమోదం పొందినట్లే’ అని వైసీపీ ఎంపీలు ప్రకటించినా… స్పీకర్ కార్యాలయం నుంచి బుధవారం రాత్రి పొద్దుపోయేదాకా ఎలాంటి అధికార ప్రకటన వెలువడలేదు.
మరోవైపు… గురువారం ఉదయాన్నే సుమిత్రా మహాజన్ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. దీంతో వైసీపీ ఎంపీల రాజీనామాల ఆమోదంపై ఉత్కంఠ నెలకొని ఉంది ! ఒకవేళ ఐదుగురు ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందినా… ఆ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయా, రావా అనే ప్రశ్న తలెత్తుతోంది. ‘ఏడాదిలోపు సార్వత్రిక ఎన్నికలు ఉంటే… ఉప ఎన్నికలు నిర్వహించకూడదు’ అని 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 151ఏ స్పష్టంగా చెబుతోంది. ఉప ఎన్నికలు జరిగే పరిస్థితి అయితే ఇక దాదాపు లేదనే రాగ్యంగా నిపుణులు కూడా పేర్కొంటున్నారు.
అసలు వైకాపా ఎంపీల రాజీనామాల ఆమోదంపై ఓ పది రోజుల కిందట స్పీకర్ ప్రయత్నించి ఉంటే ఉప ఎన్నిక అనుకునే పరిస్థితి ఉంది ఎందుకంటే అప్పటికి వారి పదివీ కాలం ఒక సంవత్సరం పది రోజులు ఉంటుంది కాబట్టి..! కానీ, పదిరోజుల పాటు తాత్సారం చేసి… వారి పదవీ కాలం ఏడాది లోపుకు వచ్చే వరకూ జాగ్రత్తగా ఆగి, పునరాలోచన పేరుతో వారికి సమయం ఇచ్చి… ఇప్పుడు తీరిగ్గా రాజీనామాలు ఆమోదించినట్టుగా కనిపిస్తోంది. సెక్షన్ 151 ప్రకారం… ఏడాదిలోపు సార్వత్రిక ఎన్నికలు రాబోయే పరిస్థితి ఉంటే, ఈలోగా ఉప ఎన్నికలు నిర్వహంచరాదు. ఖాళీ అయిన స్థానాలకి ఆరు నెలలు లోగా ఉప ఎన్నికలు జరపాలనీ చట్టం లో ఉన్నప్పటికీ… సాధారణ ఎన్నికలకు ఏడాది ముందు ఖాళీ అయితే ఉప ఎన్నికలు జరగవనేది చాలా స్పష్టంగా అదే సెక్షన్ లో తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వంతో ఎన్నికల కమిషన్ సంప్రదించిన తరువాతే ఇలాంటి పరిస్థితుల్లో ఉప ఎన్నికల నిర్వహణ కష్టం అని కూడా తేల్చి చెప్పినట్టు చట్టంలో ఉంది.
అందుతున్న సమాచారం ప్రకారం రాజీనామాలపై పునరాలోచించుకోవాలని గత సమావేశంలో కోరాం కదా ఏం ఆలోచించుకున్నారు అని స్పీకర్ ప్రశ్నిస్తే ‘రాజీనామాలకు కట్టుబడి ఉన్నట్లు గత సమావేశంలోనే స్పష్టంగా చెప్పాం. మా రాజీనామాలు సత్వరం ఆమోదించండి. మీరు మరోసారి సమావేశానికి రమ్మన్నారు కాబట్టి వచ్చాము. మా నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు’’ అని ఎంపీలు చెప్పారట. వారి సమాధానంతో స్పీకర్ సంతృప్తి చెందక కనిపించలేదు. ‘రాజీనామాలకు కట్టుబడి ఉన్నామంటూ మరో లేఖ రాసి ఇవ్వండి’’ అని వారికి సూచించారు. అంతటితో ఆ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో స్పీకర్ మాట్లాడుతూ… ‘‘మరోసారి లేఖలు పంపించాలని సూచించాను. ఏం చేస్తారో చూడాలి! లేఖలు అందిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను. గురువారం ఉదయమే నేను విదేశాలకు వెళ్తున్నాను’’ అని తెలిపారు.
స్పీకర్ సూచన మేరకు ఐదుగురు ఎంపీలు తమ రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని, వెంటనే ఆమోదించాలని విడివిడిగా లేఖలు పంపించారు. ‘‘ఏప్రిల్ 6వ తేదీన రాజీనామా లేఖలను సమర్పించాము. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని మే 29వ తేదీన మీరు సూచించారు. మీ విలువైన సూచనలకు కృతజ్ఞతలు. అయితే, మా రాజీనామా నిర్ణయం పట్ల కట్టుబడి ఉన్నాము. తక్షణమే మా రాజీనామాలను ఆమోదించండి’’ అని ఆయా లేఖలలో ఎంపీలు కోరారు. అయితే ఉప ఎన్నికల్లో వైకాపాకి పోటీగా ఇతర పార్టీలు అభ్యర్థుల్ని నిలబెడితే అది ప్రత్యేక హోదాకు తీవ్ర అన్యాయం అని నిన్న జగన్ ప్రకటించారు. కానీ ఉప ఎన్నికలు వచ్చేందుకు ఏమాత్రం ఆస్కారం లేకుండా రాజీనామాలు చేశారు, దానికి అనుగుణంగా భాజపా కూడా తనవంతు వ్యూహాత్మక ఆమోద ప్రక్రియను నడిపించింది అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మొత్తానికి ఈ ప్రక్రియ అంతా గమనిస్తున్న సామాన్య ప్రజానీకం మాత్రం అవి రాజీనామాలా లేక రాజీడ్రామాలా అని ప్రశ్నిస్తున్నారు.