Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మాటలు మనుషులపై చూపించే ప్రభావం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సానుకూలంగా ఉండే మాటలు మనిషికి ఎంతో శక్తినిస్తాయి. అదే సమయంలో రెచ్చగొట్టేలానో, వెటకారం చేసినట్టుగానో ఉండే మాటలు మనిషికి ఆగ్రహం తెప్పిస్తాయి. ఓ రకమైన కసిని పెంచుతాయి. అయితే పరిస్థితులు, మనుషుల వ్యక్తిత్వానికి కూడా ఇందులో ప్రమేయముంటుంది. ఇందుకు ఉదాహరణగా క్రికెట్ మ్యాచ్ ల గురంచి చెప్పుకోవచ్చు. బ్యాట్, బంతి కన్నా ఆటగాళ్ల మాటలు గెలుపులోనో, ఓటమిలోనో కీలకపాత్ర పోషించిన సందర్భాలు అంతర్జాతీయ క్రికెట్ లో అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా జట్టు… తమ మాటలతో ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లను బాధపెట్టడం ద్వారానో, రెచ్చగొట్టడం ద్వారానో ఔట్ చేయాలని భావిస్తూ ఉంటుంది. స్లెడ్జింగ్ అనే పదం ఈ వ్యవహార శైలి గురించి చెప్పేదే. స్లెడ్జింగ్ ద్వారా ఆస్ట్రేలియా అనేక మ్యాచ్ ల్లో విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను రెచ్చగొట్టేలా ఏదో ఒక వ్యాఖ్య చేయడం… ఆ మాట విన్న ఆటగాడు… ఆవేశానికో, కోపానికో గురై రాంగ్ షాట్ ఆడి ఔటవడం… జరుగుతూ ఉంటుంది. భారత జట్టుకూ ఆస్ట్రేలియాతో ఇలాంటి అనుభవాలు ఉన్నాయి.
సాదాసీదా ఆటగాళ్లే కాదు… క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా స్లెడ్జింగ్ బారిన పడ్డాడు. ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ అప్పట్లో సచిన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒకసారి నీ భార్య, నా పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగినట్టు వచ్చిన వార్తలు తీవ్ర సంచలనం సృష్టించాయి. వినగానే షాక్ తినేలా ఉన్న ఈ మాటను సచిన్ మాత్రం చాలా తేలిగ్గా తీసుకున్నాడు. ఆవేశానికి లోనవకుండా ఎంతో మెచ్యూరిటీగా వ్యవహరించి… నింపాదిగా తన ఆట ఆడాడు. అలా ఆస్ట్రేలియా జట్టు ఎత్తులు పారలేదు. ఈ స్థాయిలో కాకపోయినా… భారత్ కూడా ప్రత్యర్థి జట్లపై స్లెడ్జింగ్ అస్త్రాన్ని ప్రయోగించిన సందర్భాలూ ఉన్నాయి. కొన్నిసార్లు అవి ఫలిస్తే… మరికొన్ని సార్లు మాత్రం ప్రతికూల ఫలితాన్ని తెచ్చిపెట్టాయి.
2003 ప్రపంచ వరల్డ్ కప్ క్రికెట్ లో సౌరవ్ గంగూలీ నాయకత్వంలో భారత్ ఫైనల్లో ప్రవేశించింది. ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో అప్పుడు యువకుడిగా ఉన్న పేస్ బౌలర్ జహీర్ ఖాన్ పదే పదే ఆసిస్ కెప్టెన్ రికీ పాంటింగ్ ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు. దీంతో రికీ పాంటింగ్… జహీర్ ఖాన్ బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. జహీర్ వేసిన బంతులను వరుసగా బౌండరీకి తరలించాడు. మ్యాచ్ లో పాంటింగ్ 140 పరుగులతో నాటౌట్ గా నిలవగా, ఏడు ఓవర్లు బౌలింగ్ వేసిన జహీర్ ఖాన్ 67 పరుగులిచ్చి… ఒక్క వికెట్టూ తీయలేకపోయాడు. ఆ మ్యాచ్ లో భారత్ ఓటమికి రీకీపాంటింగ్ ఇన్నింగ్సే కారణం. జహీర్ ఖాన్ వ్యాఖ్యల వల్లే పాంటింగ్ అంతలా బ్యాట్ ఝుళిపించాడని అప్పట్లో క్రీడా విమర్శకులు విశ్లేషించారు. ఇలాంటిదే ఇంకో అనుభవం ఇటీవల భారత్ కు ఎదురయింది.
జూన్ లో ఇంగ్లాండ్ లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ ఫైనల్లో దాయాది జట్టు చేతిలో 180 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. అయితే ఫైనల్ ల్లో పాకిస్థాన్ మ్యాచ్ గెలిచి, ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోవడంలోపాక్ ఆటగాళ్లే కాకుండా… భారత మాజీ ఆటగాళ్లు, క్రికెట్ కామెంటేటర్లు అయిన సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి కూడా కీలకపాత్ర పోషించారట. ఈ విషయాన్ని పాక్ జట్టు మాజీ మేనేజర్ తలాత్ అలీ స్వయంగా వెల్లడించాడు. చాంపియన్స్ ట్రోఫీ సమయంలో పాక్ జట్టుకు మేనేజర్ గా వ్యవహరించిన తలాత్ అలీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు.
ఇప్పుడు భారత జట్టుకు కోచ్ గా ఉన్న రవిశాస్త్రి చాంపియన్స్ ట్రోఫీకి కామెంటేటర్ గా వ్యవహరించారు. ఫైనల్ మ్యాచ్ కు ముందు రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్ ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో వారు ఫైనల్లో ఇండియానే గెలుస్తుంది… అందులో ఎలాంటి సందేహం లేదు అని పదే పదే తమ అభిప్రాయం చెప్పారు. ఈ మాటలు విన్న పాక్ ఆటగాళ్లు తీవ్ర అసహనం వ్యక్తంచేశారని తలాత్ అలీ చెప్పారు. దీంతో వారు ఫైనల్ మ్యాచ్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, మాటలతో కాకుండా… బ్యాట్, బంతితో సమాధానం ఇవ్వాలని భావించారని, చివరకి అది చేసి చూపించారని తలాత్ అలీ చెప్పుకొచ్చారు. మొత్తానికి కామెంటేటర్ల హోదాలో… మ్యాచ్ గురించి ముందస్తు అంచనా వేస్తూ… సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి క్యాజువల్ గా అన్నమాటలు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫలితాన్ని శాసించాయన్నమాట.